Gajuwaka Young Man Suspicious Death In Canada: ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ (Visakha) గాజువాకకు చెందిన పిల్లి నాగప్రసాద్, గీతాబాయి దంపతుల కుమారుడు ఫణికుమార్ (33).. ఇటీవలే ఎంబీఏ పూర్తి చేశారు. ఎంఎస్ చదవడానికి ఆగస్ట్ 21న కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. మిత్రులతో కలిసి సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 14న తండ్రి నాగప్రసాద్‌కు... ఫమికుమార్ రూమ్ మేట్ ఫోన్ చేసి అతను నిద్రలోనే చనిపోయాడని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ ఎంపీ శ్రీభరత్‌లకు పరిస్థితి వివరించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా, కుమారుని మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఫణికుమార్ నిద్రలో గుండెపోటుతో చనిపోయాడా.? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.? అనేది తెలియాల్సి ఉంది.
స్పందించిన మంత్రి లోకేశ్
మరోవైపు, ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఫణికుమార్ మృతి చెందడం అత్యంత బాధాకరమని.. వారి తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఫణి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
Also Read: అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్- పనులకు డెడ్‌లైన్ పెట్టిన మంత్రి నారాయణ