BJP MP Pratap Chandra Sarangi Comments On Rahul : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటే బీజేపీ కౌంటర్ సిద్ధం చేసింది. అందుకే పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టింది. బాబా సాహెబ్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కిందపడిపోయారు. ఆయన తలకుబలమైన గాయమైంది.


తలకు కట్టుతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న టైంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను రాహుల్ గాంధీ నెట్టారని, ఆ తర్వాత కిందపడి తలకు గాయమైందని అన్నారు. పార్లమెంట్‌ ఎంట్రన్స్‌లో మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీసహా ఇతర ఎంపీలు ఆందోళన చేస్తున్న టైంలో ఇది జరిగిందన్నారు.   


బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. "నాపై పడి ఎంపీ రాహుల్ గాంధీ తోసేశారు, ఆ తర్వాత నేను కిందపడ్డాను. నేను మెట్ల దగ్గర నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చి నాపై పడిన తోసేశారు."అని బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి అన్నారు. 


కిందపడిన ప్రతాప్ సారంగి ఆరోగ్యం క్షీణించింది. ఆయన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫరూఖాబాద్ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ ఇలాంటి ఆరోపణలే చేశారు. రాహుల్ గాంధీ తనను కూడా నెట్టారని ఆరోపించారు. 


రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ‘నేను పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. బీజేపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బెదిరించారు. అందుకే ఇలా జరిగింది. ఇది పార్లమెంట్‌ ప్రవేశ ద్వారం. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది, వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు" అని చెప్పారు. 


ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని అన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో భారత కూటమి ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ" ఆత్మరక్షణ కోసమే బీజేపపీ నిరసనలు చేస్తున్నారు.  నిన్న అమిత్ షా మాటలతో చాలా నష్టం జరిగింది. బీజేపీ సోషల్ మీడియా ఏం చేసిందో అందరికీ తెలుసు అన్నారు. అంబేద్కర్ స్థానంలో సోరోస్ చిత్రాన్ని పెట్టారని అన్నారు.