Manipur Violence:
గత నెల భగ్గుమన్న మణిపూర్.. భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ వంటి చర్యలతో శాంతించగా.. ఇప్పుడు మరోసారి హింస చెలరేగింది. ఓ స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇంఫాల్ లోని న్యూ చెకాన్ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో వెంటనే సర్కారు భద్రతా బలగాలను మోహరించి మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఈ హింస ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఉన్నపళంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు.. ఆర్మీ, అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసు బలగాలను మోహరించారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే, ఆయన భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇంఫాల్ ఈస్ట్ లోని న్యూ చెకాన్‌లో ఓ తెగకు చెందిన వారి దుకాణాలు మూసివేయాలని ఓ వ్యక్తి బెదిరించాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ హింసలో ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదని స్థానిక అధికారులు తెలిపారు. మరోసారి హింసాత్మక ఘటన నేపథ్యంలో జనం ఒక్కచోటుకు చేరకుండా పోలీసులను, సైన్యాన్ని మోహరించారు.
మణిపూర్ లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి తెగల మధ్య నెలకొన్న వైరమే. రాష్ట్రంలో మెజారిటీ మెయిటీలకు ఎస్టీ హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. గిరిజనులు నిర్వహించిన సంఘీభావయాత్ర కాస్త హింసాత్మకంగా మారింది. కొన్ని రోజుల పాటు మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులను, సైన్యాన్ని మోహరించి పరిస్థితులను శాంతింపజేసినా.. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. గత నెలలో జరిగిన అల్లర్లకు మణిపూర్ లో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్ పుర్ కేంద్ర బిందువుగా ఉంది. కొద్దిరోజుల క్రితం సీఎం బీరేన్ సింగ్ పాల్గొనాల్సిన సభా వేదికను ఆ ప్రాంతంలో నిరసనకారులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరిగిన హింస ఇంఫాల్ లో చోటుచేసుకుంది.