Frauduer Doctor Suspended: ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు అనగానే నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉంటాయన్న భావన చాలా మందిలో ఉంది. ఎందుకంటే అక్కడ మనకు అందే సేవలు అలా ఉండటమే కారణం. రోజులు మారుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో నీరసాన్ని, నిర్లక్ష్యాన్ని మాత్రం రూపుమాపలేక పోతున్నారు. నత్తకు నడక నేర్పేలా పనులు నెమ్మదిగా జరుగుతాయి. ప్రజలు వచ్చి తమ బాధలు మొర పెట్టుకున్నా అక్కడా ఎవరూ పట్టించుకోరు. వారి నిర్లక్ష్యానికి ప్రాణాలు పోతున్నా.. చలనం రాదు. పని చేయరు, చేయనివ్వరన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ప్రభుత్వ కార్యాలయాలు ఏమైనా మారాయా అనే ప్రశ్న వచ్చినప్పుడు.. లేదు అనటానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది.
ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తూ..
ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. లంచాలు ఎలాగూ ఉండనే ఉంటాయని ప్రజలు చెబుతుంటారు. దీనికి తోడు రాకపోయినా కార్యాలయానికి వచ్చినట్టు, హాజరు కాకపోయినా హాజరు అయినట్టు చాలా మంది మోసాలకు పాల్పడుతుంటారు. ఈ మోసాలు ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతాయి. చాలా మంది ప్రభుత్వ వైద్యులు.. బయట తమ సొంత ప్రైవేటు హాస్పిటల్ ను నడిపిస్తుంటారు. ప్రభుత్వాసుపత్రిలో విధులు గైర్హాజరు అవుతూ.. తమ ప్రైవేటు ఆస్పత్రికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం సాంకేతిక సాయాన్ని తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో బయో మెట్రిక్ హాజరును తీసుకువచ్చింది. అయితే బయో మెట్రిక్ పెట్టినప్పటికీ మోసాలు ఆగడం లేదు. సాంకేతికతతో మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తే.. దానినే బురిడీ కొట్టించి ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు కొందరు అధికారులు. ఏపీలో నకిలీ వేలి ముద్రలతో హాజరు వేస్తున్న డాక్టర్ ను మంత్రి సస్పెండ్ చేశారు.
అటెండున్సులో మాత్రమే విధులకు హాజరు..
ఆయన డాక్టర్ భాను ప్రకాశ్.. బాపట్ల జిల్లా బల్లి కురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి. విధులు నిర్వర్తించేది మాత్రం మార్డూరులోని తన ప్రైవేటు ఆసుపత్రిలో. హాజరు మాత్రం గుంటుపల్లిలో నమోదు అవుతుంది. ఇదంతా కృత్రిమ వేలి చర్మం మహిమ. శనివారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ తనిఖీ నిమిత్తం అక్కడికి వచ్చారు. వైద్యాధికారి లేకపోవడాన్ని గుర్తించారు. సిబ్బందిని దీనిపై ప్రశ్నించారు మంత్రి. వైద్యాధికారి భాను ప్రకాశ్.. అసలు వైద్యాశాలకే రావడం లేదని గ్రామస్తులు మంత్రి విడదల రజనీకి ఫిర్యాదు చేశారు. అసలేంటి కథ అని తెలుసుకుంటే అసలు విషయం బయట పడింది.
రోజంతా ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉంటున్న వైద్యాధికారి..
గుంటుపల్లి ప్రైమరీ హెల్త్ కేర్ వైద్యాధికారి భాను ప్రకాశ్ కు మార్టూరు మండల కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రి ఉంది. దాన్ని చూసుకుంటున్న భాను ప్రకాశ్.. ప్రభుత్వ విధులు మాత్రం హాజరు కావడం లేదు. ఇందుకోసం ఓ పథకాన్ని రూపొందించాడు భాను ప్రకాశ్. తన వేలి ముద్రలతో నకిలీ వేలిముద్రను తయారు చేయించాడు. దానిని అక్కడి సిబ్బందికి ఇచ్చి సమయానికి వేలి ముద్ర వేసేలా వారిని పురమాయించాడు. వారు అలా భాను ప్రకాశ్ హాజరు నమోదు చేస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో విడదల రజనీ ఉన్నతాధికారులను తనిఖీ చేయాలని ఆదేశించారు. అన్ని పరిశీలించిన అధికారులు మంత్రికి రిపోర్ట్ చేయడం, ఆ వైద్యాధికారిని సస్పెండ్ చేయించారు.