Four People Died Due To House Collapsed In Nagarkurnool: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలి తల్లితో సహా ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇంటి మట్టి మిద్దె ఆదివారం రాత్రి భారీ వర్షం కారణంగా కుప్పకూలింది. ఇదే సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న పద్మతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు తేజస్విని (6), వసంత (9), కుమారుడు రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇల్లు కూలిన ప్రదేశాన్ని ఆర్డీవో, ఎమ్మార్వో, స్థానిక అధికారులు పరిశీలించారు. పాత ఇల్లు ఉన్న వారు ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేసుకోవాలని.. వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కాగా, ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాలను చూసిన బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు