Shamshabad Airport: హైదరాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ముగ్గురు కస్టమ్స్‌ అధికారులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది.  విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించినట్లు ఈ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ముగ్గురు కస్టమ్స్‌ అధికారులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. వారిలో ఇద్దరు సూపరింటెండెంట్‌లు, ఒక కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు.


హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన ఎ.శ్రీనివాసులు, పాత బోయిన్‌పల్లికి చెందిన పంకజ్‌ గౌతమ్‌, సికింద్రాబాద్‌ కవాడిగూడకు చెందిన పేరి చక్రపాణిలపై సీబీఐ అధికారులు కేసులు నమోదు  చేశారు. 2023 మార్చి 16న శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ, భారత కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌, సీఐడబ్ల్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.  నాలుగు లక్షల రూపాయలు భారతీయ కరెన్సీని తీసుకెళ్తున్న హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాకు చెందిన ప్రైవేటు వ్యక్తితో పాటు అతడి కుమారుడి వద్ద రూ.2,93,425కి సమానమైన వివిధ దేశాల కరెన్సీని నోట్లు ఉన్నాయంటూ సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో  నిందితులకు సంబంధించిన హైదరాబాద్‌లో మూడు, ఢిల్లీలో ఓ చోట ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కస్టమ్స్ లో ఇంటి దొంగలు 
శంషాబాద్‌ ఎయిర్ పోర్టు కస్టమ్స్ విభాగంలో ఇంటి దొంగల బాగోతం బయటపడింది.  విదేశీ కరెన్సీని అక్రమంగా మార్పిడి చేసినందులకు గానూ ఇద్దరు కస్టమ్స్‌ విభాగం ఆఫీస్‌ సూపరింటెండెంట్లు, ఒక ఇన్‌స్పెక్టర్‌పై  సీబీఐ కేసులు నమోదు చేసింది.  ఎయిర్ పోర్టు కస్టమ్స్‌ విభాగంలో ఓంప్రకాశ్‌ దత్తా ఆఫీస్‌బాయ్‌గా.. తనతో పాటు సంజయ్‌పాల్‌ లోడర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ గతేడాది మార్చి 16న అరైవల్‌ సర్వీస్‌రోడ్డులోని కారు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వారు కారులో ఉన్న మరో ఇద్దరికి విదేశీ కరెన్సీ ఇస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌లోని క్రైమ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి చెందిన సిబ్బంది ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న వారిని బహదూర్‌పురాకు చెందిన గులామ్‌అలీ, సాజిద్‌గా గుర్తించారు. వారి నుంచి  విదేశీ, భారతీయ కరెన్సీని  స్వాధీనం చేసుకుంది.


ఓంప్రకాశ్‌ దత్తాను విచారించడంతో విదేశీ కరెన్సీని తనకు కస్టమ్స్‌ విభాగం ఆఫీస్‌ సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసులు, పేరి చక్రపాణి, ఇన్‌స్పెక్టర్‌ పంకజ్‌ గౌతమ్‌ తమకు  ఇచ్చినట్లు అంగీకరించారు.  సంజయ్‌పాల్‌తో కలిసి వెళ్లి ఆ నోట్లను గులాంఅలీ, సాజిద్‌ వద్ద మార్చుకురావాలని పంపినట్లు విచారణలో వెల్లడించారు.  స్వాధీనం చేసుకున్న కరెన్సీని  సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు కస్టమ్స్‌ ఉన్నతాధికారులకు అప్పజెప్పారు. దీనిపై ఎయిర్ పోర్టు కస్టమ్స్‌ కమిషనరేట్‌ డిప్యూటీ కమిషనర్‌ అలేఖ్య బల్లా ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై సీబీఐ కేసు నమోదు చేసింది.