Four Died in Accident in Kakinada: కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన లారీ మరమ్మతులు చేస్తున్న వారిపై ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వస్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత బస్ డ్రైవర్ ఆపకుండా బస్సును అలాగే రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లగ్జరీ బస్సును వెంబడించి పట్టుకున్నారు. మృతులు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం వాసులుగా గుర్తించినట్లు సీఐ శేఖర్ బాబు, ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


అనంతలో బొలెరో బోల్తా


మరోవైపు, అనంతపురం జిల్లాలోనూ ఓ బొలెరో వాహనం బోల్తా పడి 40 మందికి గాయాలయ్యాయి. వజ్రకరూరు నుంచి పాల్తూరుకు మిర్చి తోటలో పని చేయడానికి కూలీలు బొలెరోలో బయల్దేరారు. వీరి వాహనం ఉరవకొండ సమీపంలోకి రాగానే వెనుక టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రైవేట్ వాహనాల ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం అనంత ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించినా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Ayyanapatrudu News: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏడోసారి గెలుస్తారా ?  అనకాపల్లిలో మాజీ మంత్రికి గెలుపు సాధ్యమేనా ?