Tension Situation In Dharmavaram: సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగగా.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో 7 వాహనాలు ధ్వంసమయ్యాయి. కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అతన్ని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలోకి జమీర్ చేరుతున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని గమనించిన టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు.
దీంతో వివాదం చెలరేగి ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పెద్దఎత్తున రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. వివాదంలో ఇరు పార్టీల నేతలకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, ధర్మవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ షాపులు మూయించారు. ఏ క్షణాన్నైనా మళ్లీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. డీఎస్పీ బి.హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలు మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక ప్రజలందరికీ భద్రత కల్పించడంతో పాటు శాంతి భద్రతలను పునరుద్ధరించినట్లు చెప్పారు.