Crime News : ఆయన తాను చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం అనే సంగతి మర్చిపోయినట్లుగా ఉన్నాడు. తాను చేయాల్సిన పని కి.. . పని చేయించుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గరా ప్రత్యేకంగా రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి. అది లంచంగా భావించడంగా మానేశాడు. తన హక్కు అనుకుంటున్నాడు. ఎంత నమ్మకం అంటే.. చివరికి ఫోన్ పే, గూగుల్ పే క్యూఅర్ కోడ్‌లు ముందు పెట్టుకుని మరీ లంచాలు తీసుకుంటున్నాడు. ఆయనే అంత టెక్నికల్‌గా అడ్వాన్స్‌గా ఉంటే.. మరి లంచాలిచ్చే వారిలో ఒకరిద్దరైనా ఆయనను మించి ఉండరా..? ఉన్నారు... ఫలితంగా ఆయన ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఇదంతా సిరిసిల్ల జిల్లాలో జరిగిందగి.
సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ లో ప్రస్తుతం వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో రైతులు ఏ పంటను వేశారో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అలాంటి అధికారుల్లో అజీజ్ ఖాన్ ఒకరు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటారు. ఆయన చేయాల్సిన పని .. రైతుల పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం. కానీ అలా చేయడానికి తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని రైతులకు హుకుం జారీ చేశారు. ఇవ్వకపోతే పంటను ఆన్‌లైన్‌లో నమోదు చేయనని చెప్పేశారు.
ఎకరానికి రూ. ఐదు వందల చొప్పున లెక్క గట్టి వసూలు చేస్తున్నాడు. అయితే చాలా మంది తమ వద్ద క్యాష్ లేదని చెబుతూండటంతో ఏకంగా ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయమని చెబుతున్నాడు. క్యూఆర్ కోడ్‌లు కూడా తెచ్చాడు. దీంతో చాలా మంది రైతులు అలాగే డబ్బులు చెల్లించి పంటలు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఓ రైతు ఈ వ్యవహారం మొత్తాన్ని తన ఫోన్‌లో బంధించారు. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది అటూ ఇటూ తిరిగి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లింది. కలెక్టర్ కూడా ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. క్షణం ఆగకుండా చర్యలు తీసుకున్నారు.
వెంటనే తాడూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి అజీజ్ ఖాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. తాను గ్రామాల్లోకి వెళ్లి ఎన్నికరాలను ఆన్ లైన్‌లో నమోదు చేశానో.. ఎంత కలెక్షన్ వచ్చిందో లెక్కలేసుకునేలోపే అజీజ్ ఖాన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే ఒక్క అజీజ్ ఖాన్ మాత్రమే దొరికాడని.. మిగతా వ్యవసాయ అధికారుల తీరు కూడా అలాగే ఉందని విచారణ జరిపి అందరిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.