Farmer Suicide Attempt: రైతులు అనగానే మొదట గుర్తుకు వచ్చేదే సమస్యలే. పంట పండించడం కోసం ఆరుగాలం శ్రమించాల్సిందే. క్రిమి కీటకాలు ఆశిస్తే.. అప్పు చేసి ఎరువులు కొని పంటకు వేయాలి. అయినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. అలా ఎంతో కష్టపడి పండించిన పంటకు మంచి ధర వస్తుందన్న నమ్మకం కూడా ఉండదు. ఇలా రైతు అనగానే ఎన్నో రకాల సమస్యలు గుర్తుకొస్తాయి. వీటికి తోడు గట్టు తగాదాలు ఉండనే ఉంటాయి. ఈ భూ సమస్యలు అనుకున్నంత సులభంగా పరిష్కారం కావు. ఎన్నో కష్టాలు పడాల్సిందే. ఆఫీసర్ల చుట్టూకాళ్లు అరిగేలా తిరుగుతారు అన్నదాతలు. ఎక్కని కార్యాలయాల మెట్లు అంటూ ఉండవు. కొన్ని భూ సమస్యలు సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి. అలాంటి ఓ భూ సమస్య వల్లే ఓ రైతు తన ప్రాణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నించాడు.
నాలుగేళ్లుగా నడుస్తున్న భూతగాదా..!
అది అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామం. అదే గ్రామానికి చెందిన శ్రీ రాములు, సుజాతమ్మల కుమారుడు పురుషోత్తం. అతనికి వారసత్వంగా తాత ముత్తాతల నుండి కొంత భూమి వచ్చింది. ఆ భూమిలోనే పురుషోత్తం పంటలు వేసుకుంటూ సాగు చేస్తున్నాడు. అయితో సుబ్బ రాయుడు అనే వ్యక్తి పురుషోత్తానికి సమీప బంధువు అవుతాడు. ఆ సుబ్బ రాయుడుకు.. పురుషోత్తం తల్లిదండ్రులు శ్రీరాములు, సుజాతమ్మల మధ్య నాలుగేళ్లుగా భూతగాదా నడుస్తూ వస్తోంది. పురుషోత్తం కుటుంబానికి చెందిన భూమిలో తనకు 56 సెంట్లు వస్తుందని సుబ్బ రాయుడు వాదిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సుబ్బ రాయుడు పోలీసు స్టేషన్ లో తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు.
ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులు!
సుబ్బ రాయుడు చేసిన కంప్లైంట్ మేరకు పురుషోత్తంను పలు మార్లు పోలీసులు స్టేషన్ కు పిలిచారు. అయినా తన సమస్య పరిష్కారం కావడం లేదని పురుషోత్తం మనవేదనకు గురి అయ్యాడు. పదే పదే స్టేషన్ కు పిలుస్తున్నారు కానీ.. భూ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయిన పురుషోత్తం.. తన ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనకాడలేదు. పురుషోత్తం గార్లదిన్నెలో సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తన భూమిలో 56 సెంట్లు వస్తుందంటూ సుబ్బ రాయుడు లేవనెత్తన వివాదాన్ని పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సెల్ టవర్ పై నుండి దూకుతానని హెచ్చరించాడు.
ఎట్టకేలకు కిందకు దిగిన పురుషోత్తం..
పురుషోత్తం సెల్ టవర్ పై దాదాపు గంట పాటు అలాగే ఉన్నాడు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని.. తన భూ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయాడు. మాటి మాటికి తనను పోలీసు స్టేషన్ కు పిలిపించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ భూమి తనకు వారసత్వంగా వస్తోందని... సుబ్బ రాయుడు కావాలనే 56 సెంట్ల కోసం, తమను మానసికంగా వేధించడం కోసం వివాదం లేవనెత్తాడని పురుషోత్తం పేర్కొన్నాడు. తన భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పురుషోత్తం సమస్యలను పూర్తిగా విని.. తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు హామీ ఇవ్వడంతో పురుషోత్తం సెల్ టవర్ పై నుండి కిందకు దిగాడు.