Kumuram Bheem Asifabad District: చింతలమానేపల్లి: కుమురం భీమ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న అన్నదాతపై ఓ ఏనుగు దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన రైతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుమురం భీమ్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో రైతు అన్నూరి శంకర్ బుధవారం తాను పండిస్తున్న మిరప తోటలో పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అంతలో ఓ ఏనుగు తోటలోకి చొరబడి రైతు శంకర్ పై దాడి చేయగా, అక్కడికక్కడే అన్నదాత ప్రాణాలు విడిచాడు. ఏనుగులు జనావాసాల్లోకి రావడంతో పాటు పంటపొలాల్లోకి వచ్చి దాడులు చేసి రైతు ప్రాణాలు బలిగొనడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 


మహారాష్ట్ర నుండి ప్రాణహిత నది దాటి తెలంగాణలోని చింతలమానెపల్లి మండలానికి ఏనుగు దారి తప్పి వచ్చినట్టు భావిస్తున్నారు. అల్లూరి శంకర్ మృతి చెందడంతో మిగతా రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవిశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎనుగు ఎటు వైపు వెళ్లిందో ఆ వైపు గస్తీ కాస్తు ఊర్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు.