YS Sharmila comments on Viveka Murder is true says BTech Ravi- కడప: మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్నారు టీడీపీ నేత బీటెక్ రవి (TDP leader BTech Ravi). వివేకాను చంపితే ఎవరికి లాభం, దాని వెనుక మొటివ్ ఏంటి అని సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నారు. ఆ మొటివ్ ఏంటో మంగళవారం (ఏప్రిల్ 2న) ఇడుపులపాయలో షర్మిల స్వయంగా చెప్పారని బీటెక్ రవి గుర్తుచేశారు. వివేకా హత్యపై జగనన్న తన సొంత మీడియా సాక్షిలో దుష్ప్రచారం చేశారని షర్మిల ఆరోపించినట్లు చెప్పారు.


సీఎం జగన్ ప్రతిసారి సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి YSRCP మేనిఫెస్టో విడుదల వరకు తన తండ్రి వైఎస్సార్ సమాధి దగ్గర నుంచే కార్యక్రమం  మొదలుపెడతా అంటారని.. నీలో వైఎస్సార్ రక్తమే అయితే అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఎందుకిచ్చారని బీటెక్ రవి ప్రశ్నించారు. చిన్నాన్న వివేకా హత్య గురించి వైస్ షర్మిల కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని చిన్నాన్న వివేకా తనపై ఒత్తిడి తెచ్చారని, రెండు గంటలపాటు అడిగారని షర్మిల మంగళవారం నాడు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే అప్పుడు చిన్నాన్న తనతో ఎందుకలా చెప్పారో, కడప ఎంపీగా తనను పోటీ చేయాలని కోరడంపై తరువాత అర్థమైందన్నారు. 


వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే కడప పార్లమెంట్ నుంచి ఆయన స్వచ్చందంగా తప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. వైఎస్సార్ అభిమానులు హత్యా రాజకీయాల వైపు ఉంటారో, తనవైపు ఉంటారో నిర్ణయించుకోవాలని షర్మిల చెప్పిన మాటల్ని బీటెక్ రవి ప్రస్తావించారు. రక్తపు మరకల పునాదుల మధ్య జీవం పోసుకున్న పార్టీ వైసీపీ అని, వివేకా హత్య కేసు హంతకులు జగన్ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్ విజయమ్మ ఎవరి వైపు ఉంటారో కడప ప్రజలకు చెప్పాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. కొడుకు జగన్, కోడలు భారతి చెప్పినట్లు విని అవినాష్ రెడ్డికి మద్దతు తెలుపుతారా, లేక కూతురు షర్మిలకు అండగా నిలవనున్నారో పులివెందుల ప్రజలకు విజయమ్మ చెప్పాలన్నారు.