Farmer's Family Commits Suicide In Kadapa District: అప్పుల భారం అధికమైంది. సాగు కష్టాల కడలిలోకి నెట్టింది. దీంతో ఆ రైతు కుమిలిపోయాడు. సాగు చేసిన పొలంలోనే తన భార్య పిల్లలకు ఉరేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా పులివెందుల (Pulivendula) నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో ఓ కుటుంబం అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర (40) 15 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని గత 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.  ప్రస్తుతం చీనీ తోట సాగు చేస్తుండగా.. తగిన ఆదాయం రాకపోగా అప్పుల భారం పెరిగింది.


ఈ క్రమంలో రుణదాతల నుంచి అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగ్గా.. దిక్కుతోచని స్థితిలో నాగేంద్ర.. భార్య వాణి (38), కుమార్తె గాయత్రి (12), కుమారుడు భార్గవ్ (11) రాత్రి 9 గంటల ప్రాంతంలో తోటలోకి తీసుకెళ్లారు. భార్యకు, పిల్లలకు ఉరేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు కుటుంబం ఇంటి వద్ద లేదని గుర్తించిన స్థానికులు తోట వద్దకు వెళ్లి చూడగా పొలంలో వీరి మృతదేహాలు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒకే కుటుంబంలో నలుగురి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.


డిప్యూటీ సీఎం పవన్ స్పందన


ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు కుటుంబం ఆత్మహత్య బాధాకరమని.. దీనిపై విచారణ జరుగుతోందని అన్నారు. రెండ్రోజుల క్రితం రైతు తన భూమి మ్యుటేషన్ పెట్టుకున్నారని.. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగిందో నివేదిక వచ్చాకే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు