Fake Currency In Andhra Pradesh | దేనికైనా పాపం పండాలంటారు.. ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో రోజున పాపం పండి పట్టుబడక తప్పదు అంటుంటారు.. గత కొంత కాలంగా దొంగ నోట్లను దర్జాగా మారుస్తూ చలమనీ అవుతున్న కేటుగాళ్లు చిన్న తప్పుకు అడ్డంగా దొరికి కటకటాటల పాలయ్యారు.. ఒకడిని అదుపులోకి తీసుకుని కూపీ లాగితే దొంగనోట్ల డొంక మొత్తం కదిలింది. మొత్తం ఈ దొంగనోట్ల ముఠా నుంచి ఏకంగా ఒక కోటి ఆరులక్షల యాభై ఎనిమిదివేల(1,06,58,000) పట్టుకుని సీజ్‌చేసిన పోలీసులు అయిదుగురి ముఠాను అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కు పంపారు..


దొంగనోట్ల ముఠా తీగ దొరికిందిలా.. 


తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలుకు చెందిన పల్లి రాంబాబు స్థానికంగా కార్‌ మెకానిక్‌ కాగా ఈ నెల ఒకటో తేదీన తన వద్దకు గంగవరం మండలం బాలంతరం గ్రామానికి చెందిన చిట్టూరి హరిబాబు అనే వ్యక్తి తన వ్యాన్‌ పాడైందని వచ్చాడు.. తన స్నేహితుడైన మరో మెకానిక్‌ ఆకుల పవన్‌, రాంబాబు కలిసి హరిబాబుకు చెందిన వ్యాన్‌ను గ్యారేజ్‌కు తీసుకెళ్లి తనిఖీచేయగా రూ.10వేలు అవుతుందని తెలిపారు. అయితే దీనికి అడ్వాన్స్‌గా రూ.2000 సదరు వ్యాన్‌ ఓనర్‌ హరిబాబు ఇచ్చాడు. వ్యాన్‌ రిపేరింగ్‌కు కావాల్సిన సామానులు కొనేందుకు ఆటో మొబైల్‌ షాపుకు వెళ్లగా అక్కడ హరిబాబు ఇచ్చిన నాలుగు అయిదు వందల నోట్లు దొంగనోట్లుగా తేలింది.. దీంతో ఈవిషయాన్ని బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్‌కు తెలిపిన క్రమంలో మెకానిక్‌ పల్లి రాంబాబు ఫిర్యాదు పై చిట్టూరి హరిబాబును అదుపులోకి తీసుకున్నారు.. దీంతో పోలీసులకు దొంగ నోట్ల ముఠా తీగ దొరికింది.. 


బిక్కవోలు నుంచి గుంటూరు వరకు...


బిక్కవోలులో కార్‌ మెకానిక్‌ ఫిర్యాదుపై చిట్టూరి హరిబాబును అదుపులోకితీసుకుని తమదైన శైలిలో విచారించిన పోలీసులకు ఈ ముఠా చాలా కాలంగా ఈ దొంగనోట్ల చలామని చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఈక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ పర్యవేక్షనలో ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ పి.విద్య ఆధ్వర్యంలో అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్‌ నేతృత్వంలో బిక్కవోలు, అనపర్తి, రంగంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కూపీ లాగే దర్యాప్తును ప్రారంభించారు. చిట్టూరి హరిబాబు నుంచి రాబట్టిన సమాచారంతో ఈ ముఠా సభ్యులైన కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన శీలం కేదారీశ్వరరావు, కాజులూరు మండలం దుగ్గుదూరుకు చెందిన చీకట్ల ఏడుకొండలు, తొండంగి మండలం బెండపూడికి చెందిన ధోనెపూడి మధులను అరెస్ట్‌చేసి వారి వద్దనుంచి 756 నకిలీ 500 నోట్లును స్వాదీనం చేసుకుని వారిని రిమాండ్‌కు పంపారు.  అయితే వీరందరికీ గుంటూరునుంచి నకిలీ కరెన్సీ  సరఫరా అవుతుందని గమనించిన పోలీసులు గుంటూరులో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..


అసలు సూత్రధారి వద్ద భారీగా నకిలీ కరెన్సీ..


బిక్కవోలు లో దొరికిన తీగను లాగితే గుంటూరులో పోలీసులకు గుంటూరులో అసలు డొంక దొరికింది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన కర్రి మణికుమార్‌ ప్రస్తుతం నివాసం ఉంటున్న గుంటూరులోని బాలాజీనగర్‌ వద్ద తనిఖీలు చేసిన పోలీసులకు నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో దొరికింది. 39,700 నకిలీ 500, 200  నోట్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ. 1,02,80,000 కాగా నిందితుని వద్దనుంచి కంప్యూటర్‌, సీపీయూ, లామినేటర్‌, పెన్‌డ్రైవ్‌లు, స్కానర్లు, ఎస్‌బీఐ పేపర్‌ షీలను స్వాదీనం చేసుకుని నిందితున్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల వద్దనుంచి మొత్తం రూ.1,06,58,000 నకిలీ కరెన్సీ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


పోలీసులకు ఎస్పీ అభినందనలు..


దొంగనోట్ల మూఠాను గుట్టురట్టు చేసిన పోలీసులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.నందకిషోర్‌ అభినందించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన అనపర్తి సీఐ వీఎల్‌వీకే సుమంత్‌, బిక్కవోలు, అనపర్తి, రంగంపేట ఎస్సైలు వి.రవిచంద్రకుమార్‌, వి.శ్రీను, టి.కృష్ణసాయిలతోపాటు సిబ్బంది ఏవీ సత్యప్రసాద్‌, పి.రఘు, కానిస్టేబుళ్లు ఎం.వీరబాబు, కె.తిరుమలయాదవ్‌, వి.త్రీమూర్తులు, వి.శివ, వి.రవికుమార్‌,వి.వరప్రసాద్‌లను ఎస్పీ అభినందించారు.