దక్కని వాటిని చూసి సంతోషించాలి కానీ ... కావాలని కోరుకుంటే క్రైమ్స్ జరిగిపోతాయి. ఒక్కోసారి అవి ఘోరమైన నేరాలు అవుతాయి. ముంబైలో ఓ మాజీ బ్యాంక్ మేనేజర్ దీన్ని గుర్తించలేకపోయారు. ఎవరూ ఊహించనంత నేరానికి పాల్పడ్డాడు.  రోజూ చూసిన డబ్బులన్నీ తనవైతే బాగుండని అనుకున్నాడు. రోజూ లాకర్లలో పెడుతున్న బంగారం అంతా తనదైతే చీకూచింత ఉండదనుకున్నాడు. అలాంటి ఆలోచనలతోనే గడిపాడు. చివరికి బ్యాంకులో చూసిన సొమ్ము, బంగారం అంతా తన సొంత చేసుకోవాలనుకున్నాడు. అంటే..  గజదొంగగా మారాలనుకున్నాడన్నమాట. అనుకున్నట్లాగానే చేశాడు. కానీ టైం బాగోలేదు ఇప్పుడు ఊచలు లెక్క బెడుతున్నాడు. ఇందులో అసలు ట్విస్టేమిటంటే... ఇప్పుడు అతను ఓ బ్యాంక్ బ్రాంచికి మేనేజర్ కూడా. 


ముంబైలోని విరార్ అనే ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచి ఉంది. ఆ బ్యాంక్‌లోకి కాస్త తీరికగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి వచ్చాడు. అతని వెంట మరొకరు ఉన్నారు. చొరవగా బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లాడు. మేనేజర్ పిలిచి కుర్చీ వేసి కలుపుగోలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే.. అతను మేనేజర్ గా ఆ బ్రాంచికి రాక ముందే..  ఆ వచ్చిన వ్యక్తే మేనేజర్. ఇంతలో హఠాత్తుగా మాజీ మేనేజర్ దాడిచేశాడు.  ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్‌ వెంటనే ప్రమాదాన్ని గుర్తించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అలారం మోగించాడు. కానీ.. పక్కా దోపిడి ప్లాన్‌తో వచ్చిన మాజీ మేనేజర్ జేబులో నుంచి గడ్డం గీసుకునే రేజర్ కత్తి తీసి... మేనేజర్ గొంతు కోసేశాడు. 


మేనేజర్ చనిపోయాడని తెలిసిన తరవాత క్యాషియర్ పై దాడి చేశాడు. అతనితో పాటు వచ్చిన వ్యక్తితో కలిసి బ్యాంకును దోచుకుందామని ప్రయత్నించాడు. బ్యాంకులో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో తెలుసు కాబట్టి చక చకా పని చేసుకుపోదామనుకున్నాడు. కానీ ప్లాన్ అడ్డం తరిగింది. బ్యాంకులోకి కస్టమర్లు రావడంతో... జరిగిన ఘోరం గుర్తించి కేకలేశారు. దాంతో దోపిడికి ప్రయత్నించిన మాజీ బ్యాంక్ మేనేజర్ పరారయ్యారు. పోలీసులు సమాచారం అందుకుని వచ్చి బ్యాంకులో పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. సీసీ కెమెరా దృశ్యాలు చూసి..మాజీ మేనేజరే దోపిడికి వచ్చాడని.. హత్య చేశాడని గుర్తించారు. 


ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్‌ను హత్య హంతకుడు  ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌లో.. వేరే బ్రాంచికి మేనేజర్‌గా పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  నెల రోజుల నుంచి ఐసీఐసీఐ విరార్ బ్యాంక్ బ్రాంచి దోపిడికి ప్లాన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ బ్యాంక్ మేనేజర్లు.. నకిలీ బంగారం తాకట్టు పెట్టడం...  డిపాజిట్లను దారి మళ్లించడం..  తప్పుడు రుణాలు ఇవ్వడం వంటి ద్వారా.. సొమ్ము కొల్లగొట్టేవారు. కానీ ఈ క్రిమినల్ మైండ్ బ్యాంక్ మేనేజర్ మాత్రం..నేరుగానే కన్నం వేయాలని ప్రయత్నించి... హత్యలకు సైతం వెనుకాడలేదు.