BTech Students of Andhra Pradesh dies in Road Accident in Tamil Nadu | తిరువళ్లూరు: తమిళనాడులో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలో ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఏపీలోని ఒంగోలుకు చెందిన వారని సమాచారం. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు ఒంగోలులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారని తెలుస్తోంది. మృతులను చేతన్‌రామ్‌, యుకేష్‌, నితీశ్‌, నితీశ్‌ వర్మ, చైతన్య విష్ణుగా తిరువళ్లూరు పోలీసులు గుర్తించారు. ఒంగోలులో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు శనివారం ఒంగోలు నుంచి తిరువళ్లూరు వెళ్లారు. వీకెండ్ ముగియడంతో ఒంగోలుకు తిరిగి వస్తుండగా ఆదివారం వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. లారీ, కారు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థులు ఐదుగురు దుర్మరణం చెందడంతో విషాదం చోటు చేసుకుంది.


ప్రమాదం నన్ను కలచివేసింది - మాజీ సీఎం జగన్
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు చనిపోయారన్న వార్త తీవ్రంగా కలచివేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బీటెక్ విద్యార్థులు మృతిచెందడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఏపీ ప్రభుత్వం మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.


Also Read: Divvela Madhuri: దువ్వాడ వాణి ఆరోపణలు బాధించాయి, నా చావుకు ఆమెనే కారణం- రోడ్డు ప్రమాదంపై మాధురి కామెంట్స్