Hyderabad News: బెట్టింగ్‌ వ్యసనం మరో విద్యార్థిని బలి తీసుకుంది.  హైదరాబాద్‌ శ్రీనిధి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్‌లో లక్ష రూపాయలు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కళాశాలలో ఫీజు చెల్లించేందుకని తన తల్లి నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లి ఆ మొత్తాన్ని బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు.  దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఘట్‌కేసర్‌ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
కాలేజీ ఫీజు కట్టాలని చెప్పి.. 
సికింద్రాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కొండూరు శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతులకు నితిన్‌(21), ఇద్దరు కుమార్తెలు. ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి కళాశాలలో నితిన్ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.  స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని రోజు కాలేజీకి వెళ్లి వస్తుండే వాడు. నితిన్ తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు చేస్తూ పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. నితిన్‌ చదివే కళాశాలలో ఫీజు చెల్లించాల్సి ఉండగా 10 రోజులు క్రితం తల్లిదండ్రులు రూ.1.03 లక్షలను కుమారుడికి ఇచ్చారు. కళాశాలలో ఫీజు చెల్లించకుండా ఆ డబ్బులు బెట్టింగ్‌లో పెట్టి నష్టపోయాడు.


ఈ విషయం తెలుసుకుని.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలా ఎందుకు చేశావని తల్లిదండ్రులు కాస్త గట్టిగా మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మంగళవారం సాయంత్రం ఘట్‌కేసర్‌- చర్లపల్లి మధ్య గూడ్స్‌ రైలు కిందపడి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా నల్గొండలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 


ఉప్పల్ లో కూడా ఇలాంటి ఘటన
ఉప్పల్ పరిధిలోని ఈస్ట్ కల్యాణపురిలో కూడా రెండు వారాల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి  లోన్ యాప్‌లో అప్పులు తీసుకుని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కాసి మొత్తం నష్టపోయాడు. చివరకు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జున్ రావు అనే వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బాగా అలవాటు పడ్డాడు.  తన వద్ద ఉన్నదంతా పెట్టి నష్టపోయాడు. తెలిసిన వారి వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక  అర్జున్‌ రావు తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.  


లాభాల ఆశజూపి నిలువునా దోచేస్తున్నారు
సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఉన్న వారిని టార్గెట్ చేసి ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైబర్ నేరగాళ్లు ఎర వేసి మాయ చేస్తున్నారు. తొలుత కొంత లాభం ఆశ చూపి..  ఆ తర్వాత వారిని ట్రాప్‌లోకి లాగి అందినకాడికి దోచేసుకుంటున్నారు.  ధనిక, పేద, మధ్య తరగతి, ఉద్యోగులు, యువత అనే తేడా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు వీరి చేతిలో మోసాలకు బలవుతూనే ఉన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా పరిస్థితిలో మార్పురావడం లేదు.