New York Crime: 



సిక్కు వృద్ధుడిపై దాడి..


భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి పలు దేశాల్లోని సిక్కులపై దాడులు పెరుగుతున్నాయి. ఇప్పటికే యూకేలో ఓ సిక్కు వ్యాపారి ఇంటిపై దాడి జరిగింది. కార్‌లనూ కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లో 66 ఏళ్ల జస్మీర్ సింగ్‌ (Jasmeer Singh)పై దాడి జరిగింది. పదేపదే ముఖంపై గట్టిగా కొట్టడం వల్ల బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. వారం క్రితం ఈ ఘటన జరగ్గా అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినట్టు న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్విటర్‌లో వెల్లడించారు. న్యూయార్క్ సిటీలో ఎంతో ప్రేమతో ఇక్కడే చాన్నాళ్లుగా ఉంటున్నాడని, ఇలా చనిపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సిక్కు పౌరుల్ని కాపాడే బాధ్యత తమపై ఉందని వెల్లడించారు. 


"జస్మీర్‌ సింగ్‌కి న్యూయార్క్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇక్కడే ఉంటున్నారు. కానీ ఇలా ఆయన చనిపోతారని ఊహించలేదు. ఇక్కడి సిక్కులందరికీ న్యూయార్క్ ప్రజల తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. మీపై జరుగుతున్న ఈ హింసాకాండని ఖండిస్తున్నాం. కచ్చితంగా మీకు అండగా నిలబడతాం"


- ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ మేయర్ 






నిందితుడు అరెస్ట్..


న్యూయార్క్‌లోని సిక్కు నేతల్నందరినీ స్వయంగా కలుస్తానని వెల్లడించారు ఎరిక్. ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు. ఓ 30 ఏళ్ల వ్యక్తి జస్మీర్ సింగ్‌ని ముఖంపై పదేపదే కొట్టినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితుడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఇటీవలే అమెరికాలో ఓ సిక్కు యువకుడిపై దాడి జరిగింది. బస్‌లో తలపాగా పెట్టుకుని ప్రయాణిస్తున్న యువకుడిపై మరో అమెరికన్ యువకుడు దాడి చేశాడు. కేవలం టర్బన్‌ (Turban) పెట్టుకున్నందుకే భౌతిక దాడికి దిగాడు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ యువకుడికి క్రిమినల్ హిస్టరీ ఉంది. నాలుగేళ్ల క్రితం ఓ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2021 జులైలో పరోల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు మరోసారి యువకుడిపై దాడి చేసి జైలు పాలయ్యాడు. అక్టోబర్ 15న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. న్యూయార్క్‌ సిటీ MTA బస్‌స్టాండ్‌ వద్ద టర్బన్ ధరించిన సిక్కు యువకుడితో వాగ్వాదానికి దిగాడు. అమెరికాలో ఎవరూ ఈ తలపాగా చుట్టుకోరని వాదించాడు. వెంటనే తొలగించాలని హెచ్చరించాడు. కానీ అందుకు ఆ సిక్కు యువకుడు ఒప్పుకోలేదు. వెంటనే అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. తలకి తీవ్ర గాయాలయ్యాయి.


Also Read: ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం వెంటనే ఆపేయాలి - టవర్ ఎక్కి వింత నిరసన