ED On betting apps: డబ్బులకు ఆశపడి  బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ అంశంపై ఈడీకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది.  బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టచెప్పారని అవన్నీ మనీలాండరింగ్ పద్దతిలోనే జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో  బెట్టింగ్ యాప్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ.. మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తోంది.  11 మంది యూట్యూబర్ల సంపాదనపై  ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు                        

Continues below advertisement


ఇటీవల    బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అనేక మంది ఆత్మహత్యలకు కారణం అవుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయిలపై కేసులు పెట్టారు. తాజాగా పలువురు నటులు, ఇన్ ఫ్లూయన్సర్లపైనా కేసులు పెట్టారు. వీరిలో విష్ణుప్రియ, టేస్టీ తేజ వంటి బిగ్ బాస్‌లో పాల్గొన్న  యూట్యూబర్లు ఉన్నారు. సురేఖ వాణి కుమార్తె సుప్రీత, రీతూ చౌదరి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పై కూడా కేసులు పెట్టారు.   యాంకర్ తో పాటు వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలపై కూడా కేసు నమోదు చేశారు. వీరందరికీ అరెస్టు ముప్పు పొంచి ఉంది.  సోషల్ మీడియా నుంచి ఆధారాలు సేకరిస్తున్నామని .. తర్వాత అరెస్టులు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.                 


బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసే వారికి పెద్ద మొత్తంలో నగదు ఇస్తున్నారు. అయితే ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరివి అన్నది ఎవరికీ తెలియదు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజలను పీడించి వసూలు చేస్తున్న డబ్బులను ఎక్కడికి తరలిస్తున్నారో తెలియదు. ఒక దాని తర్వాత కుప్పలు తెప్పలుగా బెట్టింగ్ యాప్స్ యువతను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వీటిని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు విపరీతంగా ప్రచారం చేయడం వల్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. పూర్తిగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. 


ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఇల్లీగలే. ఈ విషయం తెలిసి కూడా ఇన్ ఫ్లూయన్సర్లు ప్రమోషన్లు చేస్తున్నారు. ఊహించనంత డబ్బులు ఇస్తూండటంతో సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. మంచు లక్ష్మితో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటే.. ఊహించనంత మొత్తం ఆఫర్ చేసి ఉంటారని భావిస్తున్నాయి. ఈడీ దర్యాప్తులో వీరికి ఎన్ని లక్షలు ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు.. బెట్టింగ్ యాప్స్ తో వీరు ఎలా లబ్ది పొందారన్నదానిపై పూర్తి వివరాలు  వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.