East Godavari Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడం (Car Accident )తో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేవరపల్లి మండలం బందపురం జాతీయ రహదారిపై మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. 


అసలేం జరిగిందంటే.. 
విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఎర్టిగా కారు టైర్ పంక్చర్ అయింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎర్టిగా రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలో మృతి చెందారు. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని దేవరపల్లి ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 19 నెలల గనిస్కా మృతి చెందింది. 
న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి.. తిరిగి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను దివ్య ప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు) నెలలు వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


డివైడర్ పైకి ఎక్కి రాంగ్ రూట్ లోకి దూసుకురావడంతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ నుంచి వైజాగ్‌కు వెళ్తున్న కారు, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కార్లు వారి మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దేవరపల్లి మండలం బందపురం వద్దకు రాగానే నందిగామ నుంచి వైజాగ్ కు అతి వేగంగా వెళ్తున్న కారు డివైడర్ ఎక్కి రాంగ్ రూట్ లోకి మారిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వైజాగ్ కు వెళ్తున్న కారు ఏలూరు వైపుగా వెళ్తున్న కారును అతివేగంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఓ కారులో ఏడుగురు, మరోకారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే తాము అక్కడికి వెళ్లి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేసినా కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధకరం అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.