Pithapuram Student Missing Case : తూర్పుగోదావరి జిల్లా(East Godavari) పిఠాపురంలో విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు(Missing Case) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆమె ఆటోలో ఇంటికి వస్తున్నప్పుడు కిడ్నాప్(Kidnap) కు గురైనట్లు అందరూ భావించారు. కానీ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉప్పాడ సెంటర్(Uppada Center)లో హారిక ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఉప్పాడలో ఆమె ఓ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే హారిక అంతకు ముందు ఆటోలో వస్తున్నానని, ఆటో డ్రైవర్ ప్రవర్తన సరిగా లేదని తన స్నేహితురాలికి వాట్సాప్‌లో మెసేజ్(Whats app Message) చేసింది. ఆ తర్వాత హారిక ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కొన్ని వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఆమె లెఫ్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హారిక కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హారిక బీబీఏ మూడో సంవత్సరం చదువుతోంది. హాల్ టికెట్ కోసం పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన విద్యార్థిని హారిక కాకినాడ ఆదిత్య కళాశాల(Kakinada Adithya College)లో బీబీఏ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లేందుకు ఆమె కాకినాడకు వెళ్లే క్రమంలో అదృశ్యమైంది. ఆటోలో వస్తున్నానని డ్రైవర్(Auto Driver) ప్రవర్తన సరిగ్గాలేదని తమ స్నేహితురాలికి హారిక వాట్సాప్ మేసేజ్ చేసింది. ఆ తర్వాత హారిక ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. కానీ ఆమె కాలేజీకి రాలేదు. ఈ విషయం తెలిసిన విద్యార్థిని తాతయ్య పిఠాపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని గాలింపు కోసం ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
యువతి ఆచూకీ కోసం రంగంలోని ఐదు పోలీసు బృందాలు
ఉప్పాడ సెంటర్‌లో హారిక బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరా(CC Footage)లో నమోదు అయిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఆమె తన వాట్సాప్‌లోని కొన్ని గ్రూపుల నుంచి లెఫ్ట్ అయినట్లు కూడా గుర్తించారు. దీంతో యువతి అదృశ్యం కేసును పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు(SP Ravindranath Babu) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి, ఆరుగురు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థిని ఆచూకీ కోసం కాకినాడ పరిసర ప్రాంతాలు, వివిధ అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే పిఠాపురం స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రాథమిక సమాచారం సేకరించామన్నారు. యువతి మొబైల్ నెంబర్ తెలుసుకుని టెక్నాలజీ సాయంతో ఆచూకీ కోసం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా యువతి ఆచూకీ కనుక్కుంటామని కుటుంబ సభ్యులకు ఎస్పీ భరోసా కల్పించారు. ఎవరికైనా యువతి ఆచూకీ తెలిసినట్లయితే కాకినాడ డీఎస్పీ 9440796505, పిఠాపురం సీఐ 9440796523, పిఠాపురం ఎస్ఐ 9440796560 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.