Kakinada News : కాకినాడ జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ కారు డ్రైవర్ అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కేసుగా మార్చారు. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితునిగా చేరుస్తూ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న అనంతబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. తన భర్తను ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేయించాడని ఆరోపించిన మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తనకు న్యాయం జరిగేదాకా పోస్టుమార్టానికి మృతదేహాన్ని తీసుకెళ్లనిచ్చేది లేదని తన కుటుంబంతో కలిసి ఆందోళనబాట పట్టిన నేపథ్యంలో పోలీసులు ఉన్నతాధికారులు శనివారం రాత్రి జీజీహెచ్ కు చేరుకుని పోస్టుమార్టం నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. కేసు విచారణకు సహకరించినప్పుడే మరింత ముందుకు తీసుకెళ్లి నిందితునిపై చర్యలు తీసుకోగలమని మృతుని భార్యకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేయడంతో చివరకు శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టానికి అంగీకరించారు. దీంతో జీజీహెచ్ లోనే వైద్యులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేశారు. అంతకు ముందు పోస్ట్ మార్టం చేసేందుకు సంతకాలు చేయాలని తనను చేతులమీద కొట్టి వేధిస్తున్నారని మృతుడి భార్య వాట్సాప్ వాయిస్ మేసేజ్ ద్వారా వెల్లడించింది. ఆ తరువాత అధికారులు తనకు, తనకు పుట్టబోయే బిడ్డకు అన్ని విధాలా సాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారని మృతుని భార్య తెలిపింది. 


అజ్ఞాతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు 


హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నారన్న విషయంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వస్థలం గొల్లలమామిడాడకు చేర్చారు.  అయితే అనంతబాబు ఎక్కడ ఉన్నాడన్న విషయంలో మాత్రం పోలీసులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన నాటి మరుసటి రోజు నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే సంఘటన జరిగిన రోజున మాత్రం రంపచోడవరంలో ఓ వివాహవేడుకకు స్థానిక ఎమ్మెల్యే, నాయకులతో కలిసి హాజరయ్యారు. 


పోలీసుల అదుపులోనే అనంతబాబు ఉన్నారని ప్రచారం 


అయితే హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు పోలీసులు అదుపులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు కొట్టిపడేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అరెస్ట్ చేసిన వెంటనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉన్న ఇద్దరు గన్ మేన్లు ఎక్కడ ఉన్నారని, అంతకు ముందు ఎమ్మెల్సీతో పాటు ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారని తెలియకుండా ఉంటుందా.. పోలీసులు కావాలనే కేసును ఇప్పటికీ నీరు కార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.


పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు 


డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం నిండా కవుకు దెబ్బలు, గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కాళ్లు, చేతులు విరిచేశారని ప్రాథమికంగా రిపోర్ట్ లో తెలిసినట్లు చెబుతున్నారు. అనేక రకాలుగా సుబ్రహ్మణ్యంను హింసలకు గురిచేసి చంపేశారని, ఇది హత్యేనని ఇప్పటికే పోస్ట్ మార్టం నివేదిక ద్వారా బట్టబయలైనట్లు సమాచారం.