Nenmara Double Murder: కేరళలోని పాలక్కాడ్ జిల్లా  డబుల్ మర్డర్  కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతామరకు పాలక్కాడ్ అడిషనల్ సెషన్స్ కోర్టు మరణశిక్ష   ఖరారు చేసింది. ఈ దాడిని అరుదైన వాటిలో అత్యంత అరుదైనది గా అభివర్ణించిన న్యాయమూర్తి కెన్నెత్ జార్జ్, నిందితుడికి రూ.20 లక్షల జరిమానా విధించడమే కాకుండా, అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. కేరళ క్రైమ్ సీరిస్‌లకు ఏ మాత్రం తీసిపోని నేరం ఇది.

Continues below advertisement

ఒక జ్యోతిష్కుడి మాట.. రాజుకున్న పగ!  

ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు అసలు కారణం 2019కి ముందు జరిగింది.  చెంతామర  అనే వ్యక్తి కుటుంబంలో కలహాలు వచ్చి అతడి భార్య విడిపోవడానికి పొరుగునే ఉన్న సుధాకరన్ కుటుంబమే కారణమని ఒక స్థానిక జ్యోతిష్కుడు చెంతామరకు చెప్పాడు. ఆ క్షణం నుంచి సుధాకరన్ కుటుంబంపై చెంతామర మనస్సులో క్రూరమైన పగ రగిలిపోయింది. ఆగస్టు 2019లో, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, సుధాకరన్ భార్య సజితను ఇంట్లోకి చొరబడి వేటకత్తితో దారుణంగా నరికి చంపేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన చెంతామరకు కోర్టు రెట్టింపు జీవిత ఖైదు విధించింది.

Continues below advertisement

 బెయిల్‌పై వచ్చి నరమేధం! 

సజిత హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తూనే, బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుని జనవరి 2025లో చెంతామర బయటకు వచ్చాడు. అయితే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి రాత్రికి రాత్రే మళ్లీ పోతుండిలోని తన పాత ఇంటికి చేరుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న చెంతామర, 2025 జనవరి 27న తెల్లవారుజామున సుధాకరన్ ఇంట్లోకి   పదునైన వేటకత్తితో చొరబడ్డాడు. అడ్డువచ్చిన సుధాకరన్  , అతడి వయోధికురాలైన తల్లి లక్ష్మి  లను విచక్షణారహితంగా నరికి అక్కడికక్కడే హత్య చేసి, సమీపంలోని మట్టాయి అడవుల్లోకి పరారయ్యాడు.

 నేనేం గాంధీని కాను.. మళ్లీ చంపుతా..కోర్టులోనే హెచ్చరిక కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందర చెంతామర ప్రవర్తించిన తీరు అధికారులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. జడ్జి శిక్షపై అభిప్రాయం అడిగినప్పుడు..  నాకేం పశ్చాత్తాపం లేదు. ఒకరు చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించడానికి నేనేం మహాత్మా గాంధీని కాను! నాకు అడ్డొస్తే మళ్లీ చంపుతా, నన్ను ఉరితీసినా పర్లేదు  అంటూ బరితెగించి మాట్లాడాడు. మానసిక అనారోగ్యం నెపంతో డిఫెన్స్ లాయర్లు తప్పించుకునేందుకు చూసినప్పటికీ, అతనికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని సైకియాట్రిక్ మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వడంతో నిందితుడి నేర స్వభావం రుజువైంది.

 తీర్పుతో ఊపిరిపీల్చుకున్న బాధితుల కుటుంబం 

తల్లి, తండ్రి, నానమ్మలను వరుసగా కోల్పోయి అనాథలుగా మిగిలిన సుధాకరన్ కుమార్తెలు అతుల్య, అఖిల ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. నిందితుడు బయట ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందేమోనన్న భయంతో ఇన్నాళ్లూ బతికామని, ఈ తీర్పుతో తమకు కొంత న్యాయం జరిగిందని కన్నీటిపర్యంతమయ్యారు. సైంటిఫిక్ ఆధారాలు, 81 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా పోలీస్ యంత్రాంగం వేగంగా విచారణ పూర్తిచేసి నేరస్థుడికి ఉరిశిక్ష పడేలా చేయడంపై కేరళ ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.