Warangal Crime News | వరంగల్: వరంగల్ జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ హత్యాయత్నం కేసు విషాదాంతమైంది. లవర్‌తో కలిసి డాక్టర్ భార్య సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది. ఆమె ప్రియుడు, అతడి ఫ్రెండ్ కలిసి చేసిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. 

పోలీసుల కథనం ప్రకారం..వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి 2016లో ఫ్లోరా మరియాను వివాహం చేసుకున్నారు. కాగా, వీరిది లవ్ మ్యారేజ్. 2018లో డాక్టర్ సుమంత్ రెడ్డి తన భార్యతో పాటు బంధువుల విద్యాసంస్థలు చూసుకునేందుకు సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. సుమంత్ రెడ్డి ఓ పీహెచ్సిలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్‌గా చేరగా, ఫ్లోరా టీచర్ జాబ్ చేసింది. ఈ క్రమంలో సంగారెడ్డిలో జిమ్ కు వెళ్తున్న ఫ్లోరాకు అక్కడ ట్రైనర్ శామ్యూల్‌తో పరిచయం ఏర్పడింది. అ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో గొడవలు మొదలై తిరిగి వరంగల్ కు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో 2019లో సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ గా ఫ్లోరాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత పెంబర్తిలోని కాలేజీని రంగసాయిపేటకు మార్చారు. మరోవైపు భర్త ఎన్ని సార్లు చెప్పినా ఫ్లోరా మరియా ప్రవర్తనలో మార్పు రాలేదు. తాను లేని సమయం చూసి లవర్ శామ్యూల్‌కు ఇంటికి పిలిపించుకుంటున్న విషయం భర్త సుమంత్ రెడ్డికి తెలియడంతో దంపతుల మధ్య వివాదం మరింత ముదిరింది. తమ రిలేషన్ కు అడ్డుగా ఉన్నా భర్త సుమంత్ రెడ్డిని తొలగించుకోవాలని లవర్ శామ్యూల్‌తో కలిసి హత్యకు ఫ్లోరా ప్లాన్ చేసింది. ఇందుకోసం లక్ష రూపాయలు సుపారీ ఇచ్చింది. అందులో 50 వేలను సైబరాబాద్ లో ఏ ఆర్ కానిస్టేబుల్ గా చేస్తున్న తన ఫ్రెండ్‌ రాజ్ కుమార్ కు జిమ్ ట్రైనర్ శామ్యూల్ ఇచ్చాడు. డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసి.. తమకు అతడి అడ్డు తొలగిస్తే ఇల్లు కూడా కట్టించి చేస్తానని శ్యాముల్ ఒప్పందం చేసుకున్నాడు.

హాస్పిటల్ నుంచి వస్తుంటే దాడి..ఫిబ్రవరి 20 తేదీన కాజీపేట ఆసుపత్రి నుంచి డ్యూటీ ముగించుకుని వస్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డిని అడ్డుకున్నారు. మొదట సుత్తితో కారును బలంగా కొట్టారు అది గమనించి సుమంత్ ఆగి, కారు దిగాడు. తమ వెంట తెచ్చుకున్న సుత్తితో సుమంత్ రెడ్డి పై విచక్షణారహితంగా దాడి చేశారు. అతడు చనిపోయాడనుకుని శామ్యూల్, అతడి ఫ్రెండ్ రాజ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు డాక్టర్ ను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. కానీ సుమంత్ రెడ్డి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తిరిగి వరంగల్ కు తీసుకువచ్చారు. 

ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం డాక్టర్ సుమంత్ రెడ్డి చనిపోయాడు. కుమారుడిపై హత్యాయత్నంపై డాక్టర్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు రాజకుమార్, శామ్యూల్ తోపాటు హత్యకు ప్లాన్ చేసిన డాక్టర్ భార్య ఫ్లోరాను గురువారం నాడు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగానే డాక్టర్ హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.