Disha Encounter Case : దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని పేర్కొంది.  తదుపరి విచారణ హైకోర్టు జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ విచారణ జరిపిన సిర్పూర్కర్ కమిషన్‌ నివేదిక ఇచ్చిందని తెలిపింది. చట్టప్రకారం ఏంచేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించిందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక పూర్తిగా పరిశీలించకుండా కేసులో వాదనలు వినడం, కేసును సుప్రీంకోర్టు నేరుగా పరిశీలించడం సాధ్యంకాదన్నారు. తెలంగాణ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాలని ధర్మాసనం సూచించింది.


దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని తెలిపింది. అయితే సిర్పూర్కర్ నివేదికను వాద, ప్రతివాదులకు అందించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. నివేదికను సీల్డ్ కవర్ ఉంచాలన్న వాదనలు సుప్రీం తోసిపుచ్చింది.  విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్.రమణ  దేశంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చూపుతుందని న్యాయవాదులు వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏంలేదని, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ అన్నారు. నివేదిక ఎందుకు బయటపెట్టకూడదని జస్టిస్ హిమాన్ష్ శుక్లా ప్రశ్నించారు. నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తే లేదని సీజేఐ అన్నారు. 


అసలేం జరిగింది? 


2019 నవంబర్ 28న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి, పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ దారుణ ఘటన మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి దిశను హత్యాచారం చేసింది నలుగురు యువకులను గుర్తించి వారిని పోలీసులు అరెస్టు చేశారు. దిశకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మొదలయ్యాయి. నవంబర్ 29 న దిశ కేసులో సైబరాబాద్ పోలీసులు నిందితులు నలుగురు ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్  అరెస్టు చేశారు. నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తారని పోలీసులు గుర్తించారు. 


అయితే పోలీసుల కథనం ప్రకారం... నలుగురు నిందితులను డిసెంబర్ 6, 2019 తెల్లవారుజామున సంఘటన జరిగిన ప్రదేశానికి పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల పైకి తిరగడంతో వారిని ఎన్ కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్,  చెన్నకేశవులు ఈ ఎన్ కౌంటర్ మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ పై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఎన్ కౌంటర్ ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ నియమించింది. ఈ కమిషన్ సభ్యులు ఎన్ కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్చేసిన ప్రదేశాన్ని పరిశీలించి, అన్ని కోణాల్లో విచారణ చేసి సుప్రీంకోర్టుకు నివేదిక అందించారు.