Dharmavaram SI Rajasekhar caught harassing a woman over video call: పోలీసులు అంటే నేరస్తులకు భయం పుట్టించాలి. అంతే కానీ న్యాయం కోసం వచ్చిన వారితో కీచకులుగా ప్రవర్తించి భయపెట్టకూడదు. కానీ దురదృష్టవశాత్తూ కొంత మంది పోలీసులు అదే పని చేస్తున్నారు. అలాంటి వారిలో ధర్మవరం ఎస్ఐగా పని చేస్తున్న రాజశేఖర్ ఒకరు. ఆయన అడ్డంగా దొరికిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని పట్నం పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం వెళ్లిన ఒక గిరిజన మహిళపై సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) రాజశేఖర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఓ మహిళ తన బంధువైన మహిళ విడాకుల కేసులో భరణం గురించి చర్చించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఎస్ఐ ఆమెను లైంగికంగా వేధించాడు. తన కోరికలు తీర్చితే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరించాడు.
రాత్రివేళల్లో ఆ ఎస్‌ఐ ఆమెకు పదేపదే వీడియో కాల్స్ చేసేవాడు. నగ్నంగా కనిపించాలని ఒత్తిడి చేసేవాడు. కొన్ని సందర్భాల్లో నగ్నంగా కనిపించి వేధించేవాడు. ఎస్ఐని ఎదిరించలేక.. ఆమె భర్త బతిమాలినప్పటికీ, ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఆమె అనంతపురం వెళ్లినప్పుడు కూడా ఎస్‌ఐ ఆమెను వెంబడించి, బలవంతంగా వాహనంలో ఎక్కమని ఒత్తిడి చేసేవాడు. ఆ వేధిపులను భరించలేని మహిళ ఆ కాల్స్‌ను ఆమె రికార్డ్ చేసింది.
ఈ ఘటన వల్ల ఆ మహిళ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. ఆమె కుటుంబం ఎస్‌ఐ వేధింపుల నుంచి రక్షణ కోరుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎస్‌ఐ రాజశేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పౌరులను రక్షించాల్సిన పోలీసు అధికారి ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం క్షమించరాని నేరమని అంటున్నారు.
ఎస్ఐ రాజశేఖర్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లికి వెళ్లింది. వారు ఈ వీడియోపై అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎస్సై వ్యవహారశైలిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తారని చెబుతారు. శృతి మించిన అవినీతి వ్యవహారం కీచక వేధింపుల వరకూ వెళ్లింది. ఇలాంటి పోలీసుల్ని సర్వీసులో ఉంచకూాడదన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.