Delhi Suicide Bomb Case | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ముఖ్య అనుచరుడు అమీర్ రషీద్ అలీని ఆదివారం (నవంబర్ 16న) ఢిల్లీలో అరెస్టు చేసింది. ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉపయోగించిన కారు i-20 అమీర్ రషీద్ పేరిటే రిజిస్ట్రేషన్ అయిందని ఎన్ఐఏ విచారణలో తేలింది. దాంతో ఎన్ఐఏ ఐ20 కారు ఓనర్ అమీర్ రషీద్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ అమీర్ పాత్రను వెలుగులోకి తెచ్చింది. అమీర్ రషీద్ ఢిల్లీకి కారు కొనుగోలు చేయడానికి, ఆత్మాహుతి బాంబర్‌కు సహాయం చేయడానికి వచ్చాడని విచారణలో తేలింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కారు నడిపింది ఉమర్ ఉన్ నబీ అని తేలింది. అతను పుల్వామాకు చెందినవాడు, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అని తెలిసిందే.
అమీర్ రషీద్ నివాసం ఎక్కడ ?
అమీర్ రషీద్ కాశ్మీర్‌లోని సంబూరా, పంపోర్‌కు చెందినవాడని అధికారులు గుర్తించారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీతో కలిసి ఉగ్రదాడులకు ప్లాన్ చేశాడు. కారు కొనుగోలు చేయడానికి సహాయం చేయడానికి అమీర్ కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి వచ్చాడు, తరువాత IEDని ఉపయోగించి i-20 కారును పేల్చివేశారు. ఈ పేలుడు ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
NIA వద్ద ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
NIA ఉమర్ కు చెందిన మరో కారును కూడా స్వాధీనం చేసుకుంది. ఇందులో ముఖ్యమైన డిజిటల్ ఆధారాలతో పాటు కొన్ని ముఖ్యమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ప్రమాదంలో 13 మంది అమాయకులు చనిపోవడం, 20 మందికి పైగా గాయపడటం వంటివి అనుకోని సంఘటన కాదు. ఢిల్లీలో ఉగ్ర కుట్రకు సంకేతం.
NIA 73 మంది సాక్షులను ప్రశ్నించింది
NIA ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 73 మంది సాక్షులను ప్రశ్నించారు. గాయపడిన వారి వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. దర్యాప్తు ప్రస్తుతం అనేక దేశాలు, రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ పోలీసులు, J&K పోలీసులు, హర్యానా, యూపీ పోలీసులతో NIAకు చెందిన మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ కూడా వేగవంతం చేశారు. దర్యాప్తు బృందం పెద్ద మాడ్యూల్‌ను ఛేదించడానికి, దాడి సూత్రధారి కోసం అనేక రాష్ట్రాల్లో దాడులు, తనిఖీలు చేస్తోంది. ఈ కేసులో అనేక అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లు, విదేశీ సంబంధాలు గుర్తించి, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
నవంబర్ 10న పేలుడు
గత నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ కారు పేలుడు ప్రమాదంలో 13 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పరిగణించింది. దర్యాప్తు సంస్థలు దేశంలో విస్తరిస్తున్న వైట్ టెర్రర్ గ్రూప్‌ను బహిర్గతం చేశాయి. ఢిల్లీ సహా పలు నగరాలలో దీపావళికి ప్లాన్ చేసినా చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. రిపబ్లిక్ డే కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని, నిందితుల నుంచి తెలుసుకున్న వివరాలతో అధికారులు అంచనాకు వస్తున్నారు.