భారతదేశంలోని సబ్-కాంపాక్ట్ SUV విభాగంలో Hyundai Venue 2025, కియా సైరోస్ (Kia Syros) రెండు ప్రజాదరణ పొందిన వాహనాలుగా మారాయి. Hyundai నవంబర్ 2025లో Venueని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే Kia ఫిబ్రవరి 2025లో Syrosను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రెండు SUVలు ఆధునిక డిజైన్, ప్రీమియం ఇంటీరియర్ సహా మోడ్రన్ టెక్నాలజీతో వస్తాయి. అయితే, హ్యుందాయ్ Venue ఎక్కువ వేరియంట్‌లు, ఇంజిన్ ఎంపికలను అందిస్తుంది. మరోవైపు Kia Syros తక్కువ వేరియంట్‌లలో ఉన్నప్పటికీ ప్రీమియం ఇంటీరియర్, ఫీచర్లతో విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఈ రెండు కార్ల ఫీచర్లు, ఇంజిన్‌లు, మైలేజీని పరిశీలిద్దాం.
ధర పరంగా ఏది ఎక్కువ ఆదా ?
Hyundai Venue ధర రూ. 7.90 లక్షల నుండి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ రూ. 15.69 లక్షల వరకు ఉంటుంది. Venue మొత్తం 25 వేరియంట్‌లను కలిగి ఉంది. ఇందులో N లైన్ వంటి స్పోర్టీ మోడల్‌లు కూడా ఉన్నాయి. దీనితో పోలిస్తే Kia Syros ప్రారంభ ధర రూ. 8.67 లక్షలు ఉండగా, దాని టాప్ మోడల్ రూ. 15.94 లక్షల వరకు ఉంటుంది. Syros 13 వేరియంట్‌లతో మార్కెట్లోకి వచ్చింది. మీరు ఆదా, ఎక్కువ వేరియంట్, కలర్స్ కోరుకుంటే హ్యుందాయ్ Venue మీకు ఎక్కువ వేరియంట్‌లు, బడ్జెట్ ధరలో లభిస్తుంది. అదే సమయంలో Kia Syros కొంచెం ఖరీదైనది, కానీ పూర్తి ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ఎవరి క్యాబిన్ ఎక్కువ ప్రీమియం, విశాలమైనది?
Hyundai Venue ఇంటీరియర్ మోడ్రన్, ప్రీమియంగా ఉంటుంది. ఇందులో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. వెనుక సీటు లెగ్ స్పేస్ సగటున ఉంటుంది. మరోవైపు Kia Syros క్యాబిన్ మరింత విశాలంగా, సౌకర్యవంతంగా కనిపిస్తుంది. ఇది వెనుక వెంటిలేషన్, రీక్లైన్ సీట్లు, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ రెండింటిలోనూ ఉన్నాయి. కానీ స్పేస్ పరంగా కియా Syros ముందుంది. మీరు మీ కుటుంబానికి వెనుక సీటు కంఫర్ట్ కోరుకుంటే మీకు Syros మంచి ఆప్షన్.
ఫీచర్లలో ఎవరు ముందున్నారు?
రెండు SUVలు లెవెల్-2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హై-ఎండ్ ఫీచర్లను అందిస్తాయి. హ్యుందాయ్ Venue ప్రయోజనం ఏంటంటే, ఇది Bose 8-స్పీకర్ సిస్టమ్, OTA అప్‌డేట్‌లు, 4 వే పవర్డ్ డ్రైవర్ సీటును కలిగి ఉంది. కియా Syros దాని 30 అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కారణంగా చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే, రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, TPMS ఉన్నాయి. రెండు ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్‌తో సురక్షితమైన SUVలుగా ఉన్నాయి.
పవర్ ఇంజిన్
Hyundai Venue 3 ఇంజిన్ ఎంపికలను అందిస్తుంది. 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. ఇది వినియోగదారుల వివిధ అవసరాలకు అనుగుణంగా ఎక్కువ ఎంపికలను అందిస్తుంది. ముఖ్యంగా 1.0L టర్బో ఇంజిన్ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. Kia Syros రెండు ఇంజిన్‌లతో వస్తుంది. 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్. Syros ఇంజిన్‌లు మరింత మృదువైనవిగా, క్లీన్ అని భావిస్తారు. కాంబినేషన్ ఎంపికల విషయానికి వస్తే Venue ఎక్కువ రకాలు అందిస్తుంది. అయితే కియా Syros డ్రైవింగ్ రిఫైన్‌మెంట్‌లో ముందుంది.