Delhi Blast Case | ఢిల్లీలోని ఎర్రకోట బయట సోమవారం (నవంబర్ 10)న జరిగిన పేలుడు కేసులో ఆదివారం నాడు ఐ20 కారు ఓనర్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ చివరిసారిగా ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్ల నుండి ముఖ్యమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్లు దొరికితే, ఉమర్‌తో ఎవరికి లింక్ ఉంది, పేలుడుకు ప్లాన్ చేసింది, నిధులు సమకూర్చింది ఎవరు అనే విషయాలు తేలనున్నాయి. ఈ దాడి ఏదైనా పెద్ద ఉగ్రకుట్రలో భాగమా అనే విషయాలు తెలుసుకోవచ్చని దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.

Continues below advertisement

దర్యాప్తునకు ఈ రెండు ఫోన్లు కీలకం

హర్యానాలోని ఒక మెడికల్ స్టోర్ సీసీటీవీ ఫుటేజ్‌లో నిందితుడు ఉమర్ రెండు మొబైల్ ఫోన్‌లతో కనిపించాడు. దాంతో ఈ ఫోన్లు ఢిల్లీలో కారు పేలుడు దర్యాప్తునకు ప్రధాన ఆధారంగా మారాయి. అధికారుల ప్రకారం, ఉమర్‌తో సంబంధం ఉన్న ఢిల్లీ, ఫరీదాబాద్, మేవాడ్2లకు చెందిన ఐదు మొబైల్ నంబర్‌లను గుర్తించారు, కాని అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 మధ్య ఉపయోగించిన ఉమర్ రెండు కొత్త నంబర్‌లను ఇంకా గుర్తించలేదు. వీటినే మిస్సింగ్ లింక్‌లుగా దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

Continues below advertisement

అక్టోబర్‌లో ఫోన్లు, నంబర్‌లను మార్చాడు

పేలుడు కేసు దర్యాప్తులో ఉమర్ అక్టోబర్ 30న తన పాత రెండు నంబర్‌లను క్లోజ్ చేసినట్లు తేలింది. అదే రోజున అతని సన్నిహితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ పట్టుబడ్డాడు. అరెస్టు వార్త తెలియగానే ఉమర్ తన పాత ఫోన్‌లను ఎక్కడో పారేశాడని, నకిలీ గుర్తింపుతో రెండు కొత్త ప్రీపెయిడ్ నంబర్‌లను తీసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు.

చివరి 36 గంటల కదలికలను ట్రాక్ 

గత వారంలో ఎన్‌ఐఏ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కారులో పేల్చివేసుకున్న ఉమర్ చివరి 36 గంటల కదలికలను ట్రాక్ చేశారు. ఫరీదాబాద్ నుండి నూహ్ వరకు, ఆపై ఢిల్లీ వరకు అతని ప్రతి లొకేషన్‌ను సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డంప్, చాట్ డేటా, సాక్షుల వాంగ్మూలాలతో సరిపోల్చారు. నవంబర్ 9 సాయంత్రం తర్వాత ఫుటేజ్‌లో ఉమర్ చేతిలో ఫోన్ కనిపించలేదు. అది ఫైయాజ్ ఇలాహి మసీదు అయినా లేదా ఎర్రకోట పార్కింగ్ అయినా ఫోన్‌లను ఎవరికైనా ఇచ్చాడా లేదా నాశనం చేశాడా అని అనుమానం ఉంది.

దర్యాప్తులో పెద్ద విషయం వెలుగులోకి

నవంబర్ 10న మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమర్ తుర్క్‌మాన్ గేట్ మసీదుకు చేరుకుని 15 నిమిషాలు ఒంటరిగా ఉన్నాడు. అతను ఎవరితోనూ మాట్లాడలేదని సిబ్బంది చెప్పారు. కాని డేటా అదృశ్యం కావడంపై దర్యాప్తు చేపట్టారు. బహుశా ఇక్కడే ఫోన్‌లను ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చు. అందుకే ఆ సమయంలో మసీదులో ఉన్న ప్రతి ఒక్కరి జాబితాను సిద్ధం చేసి విచారిస్తున్నారు.

ఏటీఎం నుండి ₹76,000 విత్‌డ్రా

నూహ్ సమీపంలోని ఫిరోజ్‌పూర్ జిర్కాలో ఉమర్ నవంబర్ 10 రాత్రి 1:07 గంటలకు ఏటీఎం నుండి డబ్బులు తీస్తున్నట్లు కనిపించాడు. మెడికల్ ఎమర్జెన్సీ  ఉందని చెప్పి రెండుసార్లు కలిపి దాదాపు ₹76,000 విత్‌డ్రా చేశాడని గార్డు చెప్పాడు. దాడి చేయడానికి ముందు ఇది అతని వద్ద ఉన్న నగదు. పేలుడు జరిగిన ప్రదేశంలో పోలీసులకు రెండు లైవ్, ఒక ఖాళీ 9mm కార్ట్రిడ్జ్‌లు లభించాయి. ఈ మందుగుండు సామాగ్రిని సాధారణంగా భద్రతా దళాలు ఉపయోగిస్తాయి. ఉమర్ దగ్గర ఆయుధాలు ఉన్నాయనడానికి సాక్ష్యం లేనప్పటికీ, అతను దారిలో ఆయుధాలను పారేశాడా లేదా ఇది మరే ఇతర వ్యక్తి కార్యకలాపాలకు సంబంధించినదా అని అనుమానాలు ఉన్నాయి. 

అనేక నగరాల్లో ముమ్మర తనిఖీలు

దర్యాప్తు బృందాలు ఇప్పుడు ఫరీదాబాద్, నూహ్, గుర్గావ్, బల్లభ్‌గఢ్‌లలోని మసీదులు, అద్దె గదులు, మెడికల్ షాపులు, కోచింగ్ సెంటర్లు, ఆహార దుకాణాలపై నిరంతరం దాడులు చేస్తున్నాయి. కొత్త అద్దెదారులు, బయటి వ్యక్తుల గుర్తింపుపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఉమర్ తరచుగా సిమ్ మార్చుకునేవాడు. Signal, Briar వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించాడు. కోడ్ పదాలతో మాట్లాడేవాడు. అతడు చివరగా వాడిన ఆ రెండు ఫోన్లు దొరికితే, కుట్రకు సంబంధించిన పూర్తి విషయం బయటపడుతుందని ఒక అధికారి తెలిపారు.