Domestic Help Steals Jewellery Instgram Video:    సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం రీల్స్   చేయడం ఈ రోజుల్లో చాలా మందికి ఒక పిచ్చిగా మారింది. అయితే, ఆ రీల్స్ పిచ్చే ఒక దొంగను ఏడాది తర్వాత నడిరోడ్డుపై నిలబెట్టి కటకటాల వెనక్కి నెట్టిన వింత ఉదంతం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్  లో వెలుగుచూసింది. యజమాని ఇంట్లో అత్యంత చాకచక్యంగా దొంగిలించిన రూ.10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్, బంగారు ఆభరణాలను వేసుకుని.. ఓ పనిమనిషి మురిసిపోతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వాట్సాప్ స్టేటస్‌లు పెట్టింది. ఆ వీడియో కాస్తా యజమాని కంట పడటంతో ఏడాది కాలంగా మిస్టరీగా ఉన్న   దొంగతనం కేసును డెహ్రాడూన్ పోలీసులు ఇట్టే ఛేదించారు.

Continues below advertisement

 డెహ్రాడూన్‌లోని ఐటీ పార్క్ పరిధిలో గల సిక్కా కిమాయా గ్రీన్స్ నివాసి అయిన నితీషా వాట్స్ ఇంట్లో ఏడాది క్రితం విమలా దేవి అనే మహిళ పనిమనిషిగా చేరింది. ఆ సమయంలో ఇంట్లోని లాకర్‌లో ఉన్న ఖరీదైన నగలను చూసిన విమలా దేవి కన్ను వాటిపై పడింది. సమయం చూసి లాకర్‌లో ఉన్న రెండు వజ్రాల ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, గుండె ఆకారంలో ఉన్న డైమండ్ లాకెట్, అత్యంత ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను దొంగిలించింది. నగలు మాయమైన విషయాన్ని గమనించిన నితీషాకు మొదటి నుండి పనిమనిషి విమలా దేవి పైనే అనుమానం వచ్చింది. యజమాని నితీషా నిలదీయగానే.. విమలా దేవి ఏమాత్రం భయపడకుండా యాక్టింగ్ మొదలుపెట్టింది.  నేను దొంగను కాదమ్మా.. కావాలంటే నేనే మీతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇస్తా  అంటూ నమ్మబలికింది. ఇల్లంతా వెతికినా నగలు దొరకకపోవడంతో, నితీషా కూడా నగలు ఎక్కడో పడిపోయాయేమోనని లైట్ తీసుకుంది.  ఇలా దాదాపు ఏడాది కాలం గడిచిపోయింది. దొంగిలించిన నగలను ఇంట్లోనే దాచిన విమలా దేవి.. ఇక కేసు క్లోజ్ అయిపోయిందని భావించి ఆ ఆభరణాలను బయటకు తీసింది. ఆ వజ్రాల నెక్లెస్, ఉంగరాలు వేసుకుని అద్దం ముందు మురిసిపోతూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌తో పాటు వాట్సాప్‌లో స్టేటస్ వీడియోలు పెట్టింది. జూన్ 29న నితీషాకు తెలిసిన ఒక వ్యక్తి యాదృచ్ఛికంగా విమలా దేవి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను, ఆమె పెట్టిన రీల్‌ను చూశాడు. అందులో ఆమె వేసుకున్న వజ్రాల హారం, మిగిలిన నగలు నితీషా వాట్స్‌కు చెందినవేనని గుర్తించి వెంటనే ఆమెకు సమాచారం అందించాడు.

ఆ వీడియోను చూసి షాకైన నితీషా.. అది తన సొత్తేనని నిర్ధారించుకుని జూలై 1న రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం  డెహ్రాడూన్‌లోని జోహ్రి రోడ్డులో విమలా దేవిని పక్కా స్కెచ్‌తో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. లాకర్‌లో నగలు చూసి  దొంగిలించానని, ఆ ఆశే తనను ఇవాళ బుక్ చేసిందని లబోదిబోమంది. ఆమె నుండి రూ.10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్, బంగారు ల్యాకెట్, రెండు ఉంగరాలతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రీల్స్ పిచ్చితో దొరికిపోయిన సదరు కిలాడీ పనిమనిషిని జైలుకు తరలించారు.

Continues below advertisement