హైదరాబాద్‌లో ఓ మంచి నీటి ట్యాంకులో శవం ఉండడం కలకలం రేగింది. ఆ శవం దాదాపు నెల రోజులుగా ఆ మంచి నీటి ట్యాంకులోనే ఉందని అధికారులు గుర్తించారు. ఆ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ ట్యాంకు నుంచే వస్తున్న నీటినే తాము నెల నుంచి తాగామని ఆందోళన చెందారు. పూర్తి వివరాలివీ..


హైదరాబాద్‌లో జల మండలి వాటర్ ట్యాంకులో శవం కనిపించింది. రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంకును శుభ్రం చేయాలని సిబ్బంది ట్యాంకు పైకి ఎక్కి లోనికి దిగాడు. లోపలికి వెళ్లిన సిబ్బందికి అందులో ఓ వ్యక్తి శవం కనిపించింది. దాంతో వారు హడలిపోయారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అధికారులు తక్షణం స్పందించి, పోలీసుల సాయంతో ట్యాంకులో ఉన్న శవాన్ని బయటకు తీయించారు. ఆ శవాన్ని పరిశీలించగా.. ఆ వ్యక్తి శరీరం బాగా ఉబ్బిపోయి పాలిపోయిన రీతిలో ఉంది.


అయితే, శవం ఉన్న ట్యాంకులోని నీళ్లను కొన్ని రోజులుగా ప్రజలకు సరఫరా చేస్తూనే ఉన్నారు. ఆ శవం సంగతి తెలియడంతో ఆ నీళ్లను తాగిన ప్రజలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆ శవం ఎన్ని రోజుల నుంచి ట్యాంకులో ఉందో అంటూ వారిలోవారు చర్చించుకుంటున్నారు. నీళ్ల ట్యాంకు నిర్వహణ చేస్తున్న బాధ్యులు తరచూ పర్యవేక్షించకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముషీరాబాద్ పరిధిలో కొన్ని వేల కుటుంబాలు కుళ్లిన శవం పడిన నీటినే మంచి నీరు తాగుతూ వచ్చారు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది.


ట్యాంకు నుంచి శవాన్ని వెలికి తీసిన అనంతరం ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరైనా హత్య చేసి ట్యాంకులో శవాన్ని పడేశారా? లేక, ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మరణించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..


Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్


Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?


Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి