Daughter In Law Attacked Uncld With Sandal In Nalgonda District: ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. కొందరు ఆస్తి కోసం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లాలో (Nalgonda District) అలాంటి అమానవీయ ఘటనే జరిగింది. ఓ మహిళ దివ్యాంగుడైన మామపై చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేసింది. వీల్ ఛైర్‌లో ఉండగా ముఖంపై కొట్టింది. వదిలేయమని కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. కోడలు దాడి చేస్తుంటే అక్కడే ఉన్న కుక్క అడ్డుకునేందుకు యత్నించింది. నవంబర్ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా వేములపల్లి (Vemulapalli) మండలం శెట్టిపాలేనికి చెందిన గక్కినెపల్లి బుచ్చిరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ దంపతులు పెళ్లిళ్లు చేశారు. తనకున్న 9 ఎకరాల భూమిలో 6 ఎకరాలు ఇద్దరు కొడుకులకిచ్చి మిగతా 3 ఎకరాలు తన జీవనోపాధి కోసం ఉంచుకున్నాడు. ఇటీవల చిన్న కుమారుని కొడుకు దినేశ్ రెడ్డికి 3 ఎకరాల భూమిని బుచ్చిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ క్రమంలోనే వీరి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. తమకు తక్కువ వాటా ఇచ్చారని పెద్దకోడలు మణిమాల మామపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మామ బుచ్చిరెడ్డి ఇంటి వద్ద వీల్ ఛైర్‌లో ఉండగా ఆమె అక్కడికి వచ్చి చెప్పుతో విచక్షణారహితంగా దాడి చేసింది.


కుక్క అడ్డుకున్నా..


తనను కొట్టొద్దని మామ కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆమె కనికరించలేదు. అతని ముఖంపై చెప్పుతో దాడి చేసింది. అటు, ఇటూ తిరుగుతూ వృద్ధునిపై ఆపకుండా దాడికి తెగబడుతూనే ఉంది. ఈ క్రమంలో సమీపంలో ఓ కుక్క ఆ దాడిని అడ్డుకునే యత్నం చేసింది. ఆ మూగజీవి చూపించిన జాలైనా ఆమె చూపించలేదు. సమీపంలోని సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కనీసం మానవత్వం లేకుండా ఓ కుక్కకున్న విశ్వాసం కూడా ఆ కోడలుకి లేదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.


'మానవత్వమా నీ జాడెక్కడ.?'


అటు, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని పేర్కొన్నారు.






Also Read: Gajwel Hit and Run Case: గజ్వేల్ లో విషాదం - హిట్ అండ్ రన్ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు మృతి