Kadiyam Police Tortured Dalith Man: తూర్పుగోదావరి జిల్లా కడియంలో దారుణ ఘటన జరిగింది. విచారణ పేరిట తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశారని చాగల్లు మండలం కుంకుడుపల్లికి దళిత యువకుడు వడ్డి వెంకటప్రసాద్ ఆరోపించారు. తప్పు చేసింది తాను కాదని చెప్తున్నా వినకుండా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాదారని వాపోయాడు. దాహం వేస్తోంది మంచి నీళ్లు కావాలని అడిగితే మూత్రం తాగమన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ మహిళ అదృశ్యం కేసులో ఈ నెల 17న స్టేషన్‌కు తీసుకొచ్చి ఎస్సై తీవ్రంగా కొట్టారని వడ్డి వెంకట ప్రసాద్ వాపోయారు. సృహతప్పిన తనకు పైకి లేపి మరీ కొట్టి సంతకం చేయించుకున్నారని, ఆపై తనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి బాధితుడిని డిశ్చార్జ్ చేశారు.
అనంతరం బాధితుడు ఏమన్నాడంటే.. ‘నేను నా మిత్రునికి బైక్ ఇచ్చాను. అతను బండి తీసుకెళ్లి మిస్యూజ్ చేశాడు. పోలీసులు నాకు ఫోన్ చేసి ఓనిగట్ల రమ్మని చెప్పారు. నా దగ్గర రావటానికి ఎలాంటి వాహనం అందుబాటులో లేదని చెప్పాను. బండి పంపిస్తామని చెప్పి పంపించారు. దానిపై అక్కడకు చేరుకున్నాను. మద్యాహ్నం మూడు గంటల సమయంలో నన్ను నుంచి కడియం తీసుకువచ్చారు. రాత్రి 8.30, 9 మధ్యలో సీఐ, ఎస్ఐ వచ్చారు. ఏం జరిగిందని అడిగితే జరిగిన విషయం చెప్పా. తరువాత లోపలికి తీసుకెళ్లి ఇష్టం దుర్భాషలాడారు.’
‘ఇష్టం వచ్చినట్లు చేతులపై, చాతిపై, మొహంపై కొట్టారు. కిండ పడిపోతే కానిస్టేబుళ్లు పైకి లేపారు. మరో సారి కొట్టారు. దాహం వేస్తోందని నీళ్లు అడిగితే.. నీళ్లు కాదురా నా మూత్రం తాగు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తరువాత మరొకరిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నించోవడానికి వేరే వ్యక్తి సాయం తీసుకుంటే డ్రామాలాడుతున్నావా అంటూ దుర్బాషలాడారు. బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. బయటకు వచ్చాక ఊపరి ఆడక కింద పడిపోతే పక్కనే ఉన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంజెక్షన్లు చేసి, ఆక్సిజన్ పెట్టి రాజమండ్రికి తీసుకొచ్చారు’ అంటూ తనకు జరిగిన ఉదంతాన్ని వెంకటప్రసాద్ వివరించాడు.
బాధితుడి భార్య శిరీష మాట్లాడుతూ.. తన భర్తను పోలీసులు తీసుకెళ్లిన విషయం అర్ధరాత్రి చెప్పారని, ఆస్పత్రి వద్దకు వస్తే పోలీసులు లోపలికి అనుమతించలేదని చెప్పారు. కేసు లేకుండా రాజీ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి చేశారని, ఎంత డబ్బులైనా ఇస్తామని చెప్పారని అన్నారు. తన భర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు.
ఘటనపై పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. బాధ్యుడైన ఎస్సై శివాజీని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎస్సై శివాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శివాజీనీ వీఆర్ కు పంపించారు. యువకుడిపై పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించలేదని రాజమహేంద్రవరం సౌత్ డీఎస్పీ కె.శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. బాధితుడిని రాజమహేంద్రవరం ఏఎస్పీ రజని ఆస్పత్రిలో పరామర్శించి వివరాలు సేకరించారు.