Petrol Bomb Attack At CRPF Camp In Sopore: జమ్మూకాశ్మీర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బురఖా ధరించిన ఓ మహిళ ఏకంగా సీఆర్పీఎఫ్ క్యాంప్ మీద బాంబు దాడికి పాల్పడటం కలకలం రేపింది. సోపోర్‌లో మంగళవారం రాత్రి పెట్రో బాంబులతో దాడి చేసి, వెంటనే అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటన అంతా క్యాంప్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ చేసింది. మహిళ చేసిన పెట్రో బాంబు దాడి (Woman Hurls Petrol Bomb At CRPF Camp)తో అప్రమత్తమైన అధికారులు అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారులకు భద్రతా సిబ్బంది సమాచారం అందించగా, స్థానికంగా కార్డన్ సెర్చ్ చేసి నిందితురాలిని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. బురఖా ధరించడంతో దాడి చేసిన వ్యక్తిని గుర్తించడం భద్రతా సిబ్బందికి కష్టతరంగా మారినట్లు కనిపిస్తోంది.
అసలేం జరిగింది..
అది జమ్మూకాశ్మీర్ లోని సోపోర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్. మంగళవారం సాయంత్రం అప్పటివరకూ ప్రశాంతంగా ఉంది. దాదాపు రాత్రి 7 గంటల ప్రాంతంలో బురఖా ధరించిన ఓ మహిళ సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చింది. వస్తూనే అనుమానాస్పదంగా కనిపించిన మహిళ తన బ్యాగులో ఏదో వస్తువుల కోసం వెతికినట్లు కనిపించింది. అంతలోనే బ్యాగులో నుంచి పెట్రోల్ బాంబులు తీసి సీఆర్పీఎఫ్ క్యాంప్ గేటు వైపు విసిరి దాడికి పాల్పడింది. అనంతరం అక్కడి నుంచి మహిళ పరారైనట్లు సీసీటీవీలో రికార్డైనట్లు అధికారులు తెలిపారు.
స్థానికులు భయాందోళన..
సీఆర్పీఎఫ్ క్యాంప్ గేటు వచ్చిన వచ్చిన మహిళ పెట్రో బాంబులతో దాడి చేయడంతో రోడ్లపై ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు సంభవించిన వెంటనే ఆర్పేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది బకెట్లలో నీళ్లు తెచ్చారు. పెట్రో బాంబుల ప్రభావం అంతగా లేకపోవడంతో త్వరగానే మంటల్ని ఆర్పేశారు. అయితే ఓ మహిళ వచ్చి పెట్రో బాంబులు వేసిందంటే, ఒకవేళ రెబల్స్, ఉగ్రమూకలు బాంబులతో దాడిచేస్తే పరిస్థితి ఏంటని.. వారి భద్రతపై స్థానికుల నుంచి అనుమానాలు రెట్టింపయ్యాయి.