Couple Died Due To Current Shock In Vijayanagaram: విజయనగరం (Vijayanagaram) జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా.. కింద పడి ఉన్న తన భర్తను పట్టుకునేందుకు వెళ్లిన రైతు భార్య సైతం మృతి చెందింది. జిల్లాలోని మెంటాడ (Mentada) మండలం మీసాలపేట గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు. శుక్రవారం ఉదయం ఈశ్వరరావు గ్రామ సమీపంలో తన పొలానికి చెరువు నీటిని మళ్లించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించకుండా తాకడంతో షాక్‌‍‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, పొలానికి వెళ్లిన తన భర్త మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భార్య ఆదిలక్ష్మి సైతం పొలానికి వెళ్లింది.


భర్తను విగతజీవిగా చూసి..


పొలంలో తన భర్త విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆదిలక్ష్మి అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువుల ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత నెల 14వ తేదీనే విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని.. స్థానిక లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని మండిపడ్డారు. తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాల్ని తరలించేది లేదని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సద్దిచెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు విచారిస్తున్నట్లు తెలిపారు.


మంత్రి దిగ్భ్రాంతి


విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి చెందిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రమాద కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.


తెలంగాణలోనూ..


అటు, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఓ భవనంలోనూ విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.


Also Read: Pattiseema Pipeline: పగిలిన పట్టిసీమ పైప్ లైన్ - 20 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన నీళ్లు, పంటలు మునుగుతున్నాయని రైతుల ఆందోళన