Common Man And Police Officer Phone Call Viral In Anantapuram: ఓ పోలీస్ అధికారి, సామాన్య వ్యక్తి మధ్య ఫోన్ కాల్ సంభాషణ పెను దుమారం రేపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇవ్వాలని సదరు వ్యక్తి పోలీస్‌ను అడగ్గా వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం (Anantapuram) జిల్లా తాడిపత్రి (Tadipatri) పట్టణ సీఐ సాయిప్రసాద్‌కు అదే పట్టణానికి చెందిన రాంపుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ చేశాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఫోన్ నెంబర్ కావాలని అడిగాడు. దీనిపై స్పందించిన సీఐ.. 'నేను ఫోన్ నెంబర్ ఇవ్వాలా.. నువ్వు ఎవరు చెప్పు' అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన రాంపుల్లయ్య.. 'జేసీ ప్రభాకర్ రెడ్డి నా అంత చూస్తానని అంటున్నాడు. తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం. లేదు వేరే ఫోన్ నుంచి చేసినా తీయడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి నెంబర్ నాకు ఇవ్వు.' అని అడిగాడు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ.. 'స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వు. అంతేకానీ నన్ను నెంబర్ ఎందుకు అడుగుతున్నావు.?' అంటూ ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి బూతులు తిట్టుకునే వరకూ వెళ్లారు. ఈ ఆడియో సంభాషణ జిల్లాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ జగదీష్‌బాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అసలు ఈ రాంపుల్లయ్య ఎవరు ?, ఎందుకు తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్‌కు ఫోన్ చేశారు. వీరిద్దరూ ఇంత తీవ్రంగా ఫోన్లో సంభాషణ ఎందుకు చేసుకున్నారు. అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్న కోణాల్లో విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు.