విశాఖపట్నం: లైంగిక వేధింపులు అధికం కావడంతో కుటుంబం పరువు పోతోందన్న భయంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విశాఖపట్నంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్కా, మీ పరువు తీస్తు్న్నందుకు సారీ నాన్నా అంటూ ఆమె రాసిన చివరి మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. విద్యార్థులతో కలిసి ఫ్యాకల్టీ సైతం తనపై లైంగిక వేధింపులకు పాల్పడటం, బలవంతంగా తీసిన అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తన చావుతోనైనా ఇతర విద్యార్థినులకు న్యాయం జరగాలని ఆ విద్యార్థిని కోరుకుందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


విద్యార్థిని చివరగా రాసిన నోట్ ఇదే..
‘క్షమించండి అక్కా, ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు. అయితే నేను వెళ్ళాలి. ఏది ఏమైనా నీకు, బావ కి అభినందనలు. ఒక ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వు అది చాలు. హాయ్ అమ్మా , నాన్, అక్కా, చెల్లి మరియు కుటుంబం మొత్తానికి. నేను ఎందుకు వెళ్లిపోతున్నానో చెప్పలేను. చెప్పిన మీకు అర్ధం కాదు. ఇంకా నా గురించి మార్చిపోండి. నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నన్ను కానీ పెంచినందుకు అమ్మనాన్నలకు చాలా చాలా థ్యాంక్స్. ఐ మిస్ యూ సో మచ్... ఇంకా నా చాప్టర్ ఎండ్ అయిపోయింది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా ఇంకా పెట్టనులే నాన్న. నేను ఉంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి. అందుకే వెళ్లిపోతున్నా.. అమ్మ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త.


అక్కా, బావ ఇద్దరికీ అభినందనలు. దివ్య ఐ రియల్లీ మిస్ యూ సో మచ్. నీ ఫ్యూచర్ పైనా ఫోకస్ పెట్టు. స్టడీ లో నీకు ఏది ఇష్టం అయితే అది చదువు. పక్కవాళ్లు చెప్పారు అని నీ ఇష్టాన్ని వదులుకోవద్దు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. గుడ్ బై మీ అందరికీ నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అంటే.. ఇప్పుడు నేను చనిపోతే మీరు కొంతకాలం బాధపడి తరువాత నన్ను మరిచిపోతారు.  నీ కూతురిగా పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నీ పరువు తీసేస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్నా’ అని చివరగా విద్యార్థిని మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.


ఆత్మహత్యకు కారణం ఏంటంటే..
ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్నా. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వేధింపులకు పాల్పడుతున్న వారిలో ఫ్యాకల్టీ ఉన్నారు. అసభ్యకరంగా ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు చెప్పాల్సింది పోయి ఫ్యాకల్టీ సైతం నాతో పాటు చాలా మంది విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేక... అలా అని కాలేజీకి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం, మా భయం ప్రపంచానికి తెలుస్తుంది. అందుకే ఆ పని నేనే చేస్తున్నా నాన్నా.. నన్ను క్షమించండి నాన్నా. ఇప్పుడు నేను చనిపోతే మీరు కొంతకాలం బాధపడి తరువాత నన్ను మరిచిపోతారు’ అంటూ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిని మెస్సేజ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పకుండా.. మీ అమ్మాయి కనిపించడం లేదంటూ కాలేజీ నుంచి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందినట్లు చెప్పి కన్నీటి పర్యంతమవుతున్నారు. తన కూతురి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదుచేశారు.