Casino Coins  :   పది రూపాయల నోటును రెండు ముక్కలు చేసి ఓ ముక్క హీరో దగ్గర ఉంటే.. ఇంకో ముక్క విలన్ దగ్గర ఉంటుంది. రెండింటిని కలిపి తీసుకెళ్లి పెద్ద డాన్‌కి ఇస్తే డబ్బులే డబ్బులే. ఈ సీక్రెట్‌ను మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ కాయిన్స్‌తో జరిగే ఇలాటి వ్యవహారాల గురించి పెద్దగా సినిమాల్లో రాలేదు. కేసినోల్లో..పేకాట క్లబ్బుల్లో కాయిన్స్‌తో ఆటలాడుతారని తెలుసు. కానీ ఇదే ఫార్ములాతో చీకోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున హవాలా బిజినెస్ చేసినట్లుగా ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కోట్ల కొద్దీ నగదును తీసుకుని వాటికి బదులుగా కొన్ని కాయిన్స్ ఇచ్చేవారు. 

కాయిన్స్‌తో కోట్లను మార్పిడి చేసిన చీకోటి ప్రవీణ్ 

అంటే వాటి విలువ కోట్లన్నమాట. వాటిని తీసుకుని ఆ వ్యక్తి ఏ దేశంలో కేసినో ఆడాలనుకుంటున్నాడో ఆ దేశంలో ఉండే చికోటి ప్రవీణ్  ఏజెంట్‌ను కలిసి ఆ కాయిన్స్ ఇస్తే అక్కడి కరెన్సీలో దానికి తగ్గ విలువ ఇస్తారు. కమిషన్ ఉంచుకుంటారు అది విషయం. మళ్లీ కేసినోలో ఆడి పోగొట్టుకున్నవి పోగొట్టుకోగా.. మిగలినవి ఏమైనా ఉన్నా ఆ కాయిన్స్‌లోనే తెచ్చుకుంటారు. వాటికి తగ్గట్లుగా ఇక్కడ ప్రవీణ్ నోట్స్ మార్పిడి చేస్తాడు. విదేశాలకు వెళ్లి కేసినో ఆడాలంటే కష్టమనే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇక్కడి నుండి ఇతర దేశాలకు కస్టమర్లను తరలించే ముందు టోకెన్ విధానాన్ని చీకోటి ప్రవీణ్ అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది.  

రెండు వైపులా కాయిన్స్‌తోనే లావాదేవీలు

క్యాసినో ఆడేందుకు కస్టమర్ల నుండి నగదు తీసుకుని వారికి ఇక్కడే టోకెన్ లు జారీ చేసేవాడని తెలుస్తోంది.  విదేశాల్లో ఆడాలంటే ఇక్కడి కరెన్సీని ఫారిన్ ఎక్సేంజ్ చేయాలి. భారీగా ఫారిన్ కరెన్సీ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు కాబట్టి టోకెన్ విధానం పెట్టాడు. క్యాసినో ముగిశాక ప్రైజ్ మనీ సైతం టోకెన్ విధానం లోనే చెల్లించేవాడు. విదేశాల్లో టోకెన్ తీసుకున్నాకా తిరిగి హైదరాబాద్ వచ్చాక నగదు చెల్లింపులు చేసేవారు. టోకెన్ జారీ, చెలింపుల ద్వారా  ఫెమా ఉలంఘన కు పాల్పడింది  చికోటి అండ్ టీమ్. 

ప్రవీణ్ దగ్గర నుంచి లభించిన సమాచారంతో మరింత మందికి నోటీసులు

దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఈడీ సేకరించినట్లుగా తెలుస్తోంది. విదేశీ బ్యాంక్ ఖాతాలను కూడా గుర్తించారు. వాటి ద్వారా జరిగిన చెల్లింపులను ఈడీ పరిశీలిస్తోంది.  చికోటి ల్యాప్ టాప్ లో ఉన్న డేటా ను  లోతుగా విశ్లేసిస్తున్నారు. త్వరలో చికోటి ప్రవీణ్ విచారణ సందర్భంగా బయటపడిన వివరాలతో మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో ప్రముఖులుంటే మరింత సంచనలం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.