మహిళ కనిపిస్తే చాలు మాగవ మృగాలు రెచ్చి పోతున్నారు. వయస్సుతో తేడా లేకుండా పసికందుల వద్ద నుండి పండు ముసళ్ళలని చూడకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడి హత మార్చిన దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, సోమపురం గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం‌ కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు ఏమైందంటే. ???


పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..  చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం, సోమపురం‌ గ్రామానికి చెందిన బాలకృష్ణ, భాగ్యలక్ష్మీ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి  శాంతి(15) అనే ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా బాలకృష్ణ, భాగ్యలక్ష్మీ దంపతులు పెంచుకునే వారు. సోమపురానికి పక్కనే ఉన్న రాళ్ళబుదుగురు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల్లో శాంతి పదో తరగతి చదువుతుంది. సోమపురానికి పక్క గ్రామమైన వేంకటేశ్వరపురానికి చెందిన కళ్యాణ్ పాల డైరీలో ఆటో డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  ఇతను శాంతికి సొంత మేనమామ.


పక్క గ్రామం కావడంతో శాంతి సొంత మేనమామ అయిన కళ్యాణ్ తరచూ ఇంటికి వచ్చి వెళ్ళే వాడు. అలానే శాంతిని పాఠశాలకు తీసుకెళ్ళి, తిరిగి తీసుకొచ్చేవాడు. బుధవారం (ఆగస్టు 2) సాయంత్రం రోజు మాదిరిగానే కళ్యాణ్ తన మేన కోడలైన శాంతిని స్కూల్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా శాంతిపై కన్నెసిన కళ్యాణ్, బాలిక నోటిలో గుడ్డ నొక్కి అత్యాచారం చేసాడు. బాలిక విషయం బయట చెప్తుందని భయపడిన కళ్యాణ్, బాలిక గొంతు నులిమి హత్య చేశాడు. బాలిన మృతి చెందిన తర్వాత ఇంటి నుండి పరార్ అయ్యాడు.  


అయితే కూలీ పనులు పూర్తి చేసుకుని‌ ఇంటికి వచ్చిన శాంతి తల్లిదండ్రులు బాలకృష్ణ, భాగ్యలక్ష్మీలు ఇంటిలో విగతజీవిలా పడి ఉన్న శాంతిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. అయితే కుమార్తె మృతిదేహాన్ని చూసి వారు కేకలు వేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానికులు కళ్యాణ్ ఇంటికి వచ్చి వెళ్ళడం తాము చూసామని, కళ్యాణే ఈ దారుణంకు ఒడిగట్టి ఉంటాడని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.‌ దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పదో తరగతి బాలికను దారుణంగా హత్య చేసిన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.‌