Chittoor Crime : ప్రేమ విఫలమైందనో, ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించారనో, ప్రేయసి మోసం చేసిందనో యువతి, యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల మాటలను పెడదారిన పెట్టి చెడు మార్గాలను ఎంచుకుని బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు కొంత మంది యువత. చిన్న చిన్న కారణాలకే కోపం తెచ్చుకుని బలవన్మరణాలకు పాల్పడుతూ కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పొలం అమ్మి డబ్బులు ఇవ్వాలని ఓ యువకుడు తల్లిదండ్రులను కోరారు. అందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.
అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా కేంద్రం శివారు ప్రాంతమైన దొడ్డిపల్లెలోని సీసీఎస్ కాలనీకి చెందిన నజీర్ బాషా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. నజీర్ బాషాకు ఒక్కగానొక్క కుమారుడు మహబూబ్ బాషాను చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచి పోషించారు. అయితే బీఫార్మసీ వరకూ చదివిన మహబూబ్ బాషా, దొడ్డిపల్లెల్లో ప్రైవేట్ ప్రాక్టీసర్ గా ఉంటూ ఆర్ఎంపీ డాక్టర్ సర్టిఫికేట్ పొంది చిన్న చికిత్స కేంద్రాన్ని నడుపుతున్నారు. అయితే మహబూబ్ బాషా కాలేజీకి వెళ్లే సమయంలో ఓ యువతితో స్నేహంగా మెలిగేవాడు. వీరి స్నేహం ప్రేమగా మారడంతో గత ఐదు సంవత్సరాలుగా మహబూబ్ బాషా యువతిని ప్రేమిస్తూ వచ్చాడు. ఇద్దరి కుటుంబాల వారికి వీరి ప్రేమ విషయం తెలియజేసి అతికష్టం మీద ఒప్పించారు. దీంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ప్రేమించిన యువతితో నిండు నూరేళ్లు కలిసి జీవిద్దామని కలలు కన్నాడు.
పెళ్లికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి
మహబూబ్ బాషా ప్రేమించిన యువతి తమ వివాహాన్ని ఘనంగా చేసుకోవాలని చెప్పడంతో తమ పెళ్లికి డబ్బులు ఇవ్వాలని మహబూబ్ బాషా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఘనంగా వివాహం చేసేందుకు డబ్బులేవని, అందుకే ఎటువంటి ఆర్భాటం లేకుండా పెళ్లి జరుపుతామని తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోకుండా తమ తాతలు ద్వారా పొందిన పొలాన్ని అమ్మి నగదు ఇవ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు. ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వచ్చిన మొదలుకొని అర్ధరాత్రి వరకూ తల్లిదండ్రులను తీవ్రంగా నానామాటలతో దూషిస్తూ ఉండేవాడు. తమ తాతలు సంపాదించిన కొద్ది పాటి పొలాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మేది లేదని తల్లిదండ్రులు తేల్చి చెప్పడంతో ఆవేదనకు గురైన మహబూబ్ బాషా ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక్కగానొక్క కుమారుడు
బంధువుల ఇంటికి వెళ్లిన మహబూబ్ బాషా తల్లిదండ్రులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోయే సరికి పొరుగింటి వారికి ఫోన్ చేసి మహబూబ్ కు ఫోన్ ఇవ్వాలని కోరారు. దీంతో పొరుగింటి వ్యక్తి మహబూబ్ ఇంటికి వచ్చి ఎన్ని సార్లు పిలిచినా స్పందించకపోవడంతో ఇంటి తలుపులు తెరిచే ప్రయత్నం చేశాడు. మహబూబ్ బాషా లోపల గడియపెట్టుకోవడంతో తలుపులు ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో మరికొందరి సహాయంతో ఇంటి తలుపులు పగలకొట్టారు. అప్పటికే మహబూబ్ బాషా విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు మహబూబ్ బాషా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు నివాసానికి చేరుకుని ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యాంతం అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.