Chittoor News : చిత్తూరు జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. పెనుమూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేస్తున్న రైతు గుండెపోటుతో మృతి చెందాడు.  పొలం సమస్య పరిష్కరించాలని నిన్నటి నుంచి రైతు దీక్ష చేస్తున్నాడు.  


అసలేం జరిగింది? 


చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిన్నటి నుంచి నిరసన చేస్తోన్న రైతు మృతి చెందాడు. గత 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మినాయుడు కండ్రిగ గ్రామస్తులు ఆక్రమిస్తున్నారని రైతు పి.రత్నం నిరసన చేపట్టారు. రామకృష్ణపురానికి చెందిన రైతు పి. రత్నం శుక్రవారం నుంచి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా చేపట్టాడు. గ్రామస్తులు ఆక్రమణ నుంచి తన భూమిని కాపాడుకునేందుకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు తనను ఇబ్బందులకు గురి చేయడంతో  రైతు నిన్నటి నుంచి ఎమ్మార్వో  కార్యాలయం ముందు న్యాయ పోరాటానికి దిగాడు. గ్రామస్తుల ఆక్రమణకు ప్రయత్నిస్తుండడంతో పాటు అధికారులు అడ్డుకోకపోవడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. రైతు అధికారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు.