Madanapalle Murder : మద్యానికి బానిసైన తండ్రి రోజూ తల్లిని చిత్రహింసలకు గురిచేయడం చూసి భరించలేక కొడుకు తండ్రినే హత్య(Father Murder) చేశాడు. తల్లిని చిత్రహింసలు పెడుతున్న తండ్రిని బ్లేడ్(Blade)తో గొంతుకోసి చంపాడు కుమారుడు. ఈ ఘటన శనివారం చిత్తూరు జిల్లా(Chittoor District) మదనపల్లె(Madanapalle)లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు(Tamil Nadu)లోని దేవికాపురానికి చెందిన కదిరేషన్, అతని భార్య మలార్‌కుడి మూడేళ్ల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతనికి కుమార్తె శ్రీమతి, కుమారుడు ఆదికేశవ్ ఉన్నారు. చేనేత పనిచేస్తూ కదిరేషన్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మద్యానికి బానిసైన కదిరేషన్ ప్రతి రోజు భార్యను హింసించేవాడు. తండ్రి తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని ఇంటర్ చదువుతున్న ఆదికేశవ్ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న తండ్రి గొంతును బ్లేడ్‌తో కోసి ఆదికేశవ్ పరారయ్యాడు. శనివారం ఉదయం ఈ ఘటనను భార్య, కుమార్తె గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, వన్‌టౌన్ సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ లోకేష్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి సోదరుడు సెల్వకుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిని వేధించడం తట్టుకోలేక అతని కుమారుడు ఆదికేశవ్ ఈ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు.
తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఘాతుకం
తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ కొడుకు కన్న తండ్రినే హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారిమెరక గ్రామానికి చెందిన శేఖర్ బాబు ఉపాధి కోసం20 ఏళ్ల పాటు గల్ఫ్‌లో పనిచేసి మూడేళ్ల కిందట సొంత ఊరికి వచ్చాడు. ఆయన భార్య కూడా గల్ఫ్ నుంచి ఇటీవలే వచ్చారు. భార్య గల్ఫ్‌లో ఉన్న సమయంలో శేఖర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు శరత్ బైక్ కొనుక్కునేందుకు తండ్రిని డబ్బులు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని శేఖర్ చెప్పాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న కుమారుడు ఆస్తులన్నీ అమ్మేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇస్తున్నాడని, తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. దీంతో ఈ నెల 6వ తేదీన తనతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చదువుతున్న ఆరుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుపరాడ్డుతో దాడి చేశారు. తలపై తీవ్రంగా కొట్టడంతో శేఖర్ మృతి చెందాడు. బంధువులు వచ్చే సరికి తండ్రి ప్రమాదవశాత్తు పడిపోయాడని నమ్మించి రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆస్పత్రికి వచ్చేసరికి శేఖర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కొడుకు మీద అనుమానంతో ప్రశ్నించగా తానే తండ్రిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. కాళ్లు, చేతులు విరగ్గొడదామనుకుంటే ప్రమాదవశాత్తు చనిపోయాడని శరత్ పోలీసులకు చెప్పాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.