Chittoor Crime : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి వేధింపులు మొదలుపెట్టాడు. మద్యానికి బానిసైన నిత్యం భార్యను మానసికంగా వేధించేవాడు. అనుమానంతో చివరకు భార్యను హత్య చేశాడు ఆ వ్యక్తి. నిద్రపోతున్న భార్య తలపై బండతో కొట్టి, భార్య ధరించిన చున్నితో గొంతును బిగించి హత్య చేసి నీవానదిలో పడేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది. 


అసంలేం జరిగింది? 


చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లెకు చెందిన చిన్నబ్బ మందడి కుమార్తె మోహనా అలియాస్ రోజా(25)కు చిత్తూరు మండలం వి.ఎన్.పురం గ్రామానికి చెందిన బాలయ్య కుమారుడు ప్రకాష్ తో 2020లో వివాహం అయింది. అయితే వివాహం జరిగిన కొద్దిరోజుల వరకూ ప్రకాష్ భార్య రోజాను‌ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. గ్రామంలో తెలిసిన వారి ఇంటికి వెళ్లినా ప్రకాష్ భార్యపై అనుమానపడేవాడు. ఎవరితోనూ మాట్లాడొద్దనేవాడు. దీంతో వారంలో ఓసారి రోజా అమ్మగారింటికి వెళ్లేదు. అదే సమయంలో‌ భర్త ప్రకాష్ ను పిలిచినా అతడు వెళ్లేవాడు కాదు. తరచూ భార్య అమ్మగారింటికి వెళ్లి ఏదో చేస్తుందని అనుమానం‌ పెంచుకున్న ప్రకాష్ తరచూ మద్యానికి‌ బానిసగా మారాడు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో భార్యను వేధింపులకు గురి చేసేవాడు. భర్త వేధింపులు భరించలేని రోజా భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. 


భార్యపై పైశాచికత్వం 


ఇంటిలో కుమారుడిని మందలించిన చిన్నబ్బ కోడలిని తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. భార్యపై బాగా అనుమానం పెంచుకున్న ప్రకాష్ లో ఎటువంటి మార్పు రాలేదు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో భార్యను అనరాని మాటలతో చిత్ర హింసలకు గురి చేసేవాడు. తన తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని ప్రకాష్ బెదిరించేవాడు. భర్తపై భయంతో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తల్లిదండ్రులకు గానీ, అత్తమామలకు గానీ చెప్పేది‌ కాదు. దీంతో మరింతగా రెచ్చిపోయిన ప్రకాష్ భార్యపై తన పైశాచికత్వాన్ని‌ ప్రదర్శించేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీ రాత్రి భార్య భర్తల మధ్య ఎప్పటి‌ లాగే గొడవ జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడమే అదునుగా భావించిన ప్రకాష్ భార్య నిద్ర పోతున్న సమయంలో తలపై బండ రాయితో బలంగా కొట్టాడు. భార్య ధరించిన చున్నితో‌ మెడను బిగించి‌ కిరాతకంగా హత్య చేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా భార్య శవాన్ని గ్రామానికి సమీపంలోని నీవానదిలో పడేశాడు. 


మంగళసూత్రం ఆధారంగా 


అయితే గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఎన్.ఆర్.పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు సాగించారు. మంగళసూత్రం, మెట్టెలు, దుస్తులు ఆధారంగా తమదైన శైలిలో విచారణ సాగించారు. విషయం తెలుసుకున్న మృతురాలి అత్తమామ, తల్లిదండ్రులు గుర్తు తెలియని శవం ఆనవాళ్ళు చూసి రోజావే అని నిర్ధారణకు వచ్చారు. దీంతో రోజా భర్త ప్రకాష్ పై అనుమానం వచ్చి ఆచూకీ కోసం గాలించారు. అప్పటికే ప్రకాష్ ఇంటి‌ నుండి‌ పరారయ్యాడు. ప్రత్యేక బృందాలతో ప్రకాష్ కోసం గాలించారు పోలీసులు. ఈ క్రమంలో 23వ తేదీన ఠానా చెక్ పోస్టు వద్ద ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే రోజాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో‌ నిందితుడు ప్రకాష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.