Chittoor Crime News: యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నావంటూ తమకు ఫిర్యాదు వచ్చిందని.. వేంటనే గ్రామ సర్పంచుతో పాటు విచారణకు ఎస్పీ కార్యాలయానికి రావాలంటూ ఓ యువకుడికి ఫోన్ కాల్ వచ్చింది. తరచుగా బెదిరిస్తూ.. ఓ యువతి తరఫు బంధువులు ఇలా ఫోన్ చేశారు. ఒకవేళ రాకపోతే తామే ఇంటికి వచ్చి కొట్టుకుంటూ వెళ్తామని యువకుడిని ఫోన్ ద్వారా బెదిరించడంతో ఏం చేయాలో అర్థం కాని యువకుడు భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతుంది.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న యువకుడి తల్లి ఏం చేసిందంటే..?
గుడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిన్న గొల్లపల్లికి చెందిన గణేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం అమ్మాయి తరపు బంధువులకు తెలియడంతో ఎలాగైనా గణేష్ ను బెదిరించి, తమ బంధువు యువతి నుండి దూరం చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే అమ్మాయి తరఫు బంధువులు ఈనెల 14వ తేదీన గణేష్ కు ఫోలీసులం అంటూ ఫేక్ ఫోన్ కాల్ చేశారు. తాము ఎస్పీ ఆఫీసు నుండి ఫోన్ చేస్తున్నామని, తను పోలీసు శాఖలో పెద్ద స్థాయి ఉద్యోగి అని, వెంటనే విచారణకు ఎస్పీ ఆఫీసుకు రావాలంటూ గణేష్ ను ఓ వ్యక్తి బెదిరించాడు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని గణేష్ ఆ వ్యక్తితో వారించాడు. ఎస్పీ ఆఫీసుకి రాకపోతే తామే స్వయంగా మీ ఇంటికి వచ్చి కొట్టుకుంటూ లాక్కెళ్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన గణేష్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత కాసేపటికే ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గణేష్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఫోన్ నెంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. కుటుంబ సభ్యులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే గణేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి పంపించారు. గణేష్ శరీరం వైద్యానికి సహకరించలేక పోవడంతో గణేష్ మృతి చేందాడు. దీంతో గణేష్ మృతిదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని వచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే గణేష్ ఉపయోగించిన మొబైల్ ఫోన్ ను కుటుంబ సభ్యులు పరిశీలించగా, అందులో ఆడియో కాల్ రికార్డు వెలుగు చూసింది. దీంతో గణేష్ తల్లి గుడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ కాల్ రికార్డును పోలీసులకు అందజేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోన్ బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.