Raipur Balodabazar Road Accident: రాయ్‌పూర్: ప్రయాణికులతో వెళ్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో 13 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్- బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. 

చౌతియా ఛత్తిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన వారు తమ వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో ఖరోరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సారగావ్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 13 మందిలో 9 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 12 మంది గాయపడ్డారు.

"చటౌడ్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చఠీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బన్సారీ గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.