సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గోగుండ కొండలలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ జరుగుతోంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పులలో 16 మంది మావోయిస్టులు మృతిచెందారని సమాచారం. . ఉదయం నుండి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లలో ఒకేరోజు 30 మంది మావోయిస్టులు మృతిచెందారు. 

16 మృతదేహాలు రికవరీ చేసుకున్న పోలీసులు

గోగుండ కొండపై మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో భద్రత బలగాలు సుక్మా జిల్లాను జల్లెడ పడుతున్నాయి. పలుచోట్ల పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడంతో భద్రతా బలగాలతో కాల్పులు చోటుచేసుకున్నాయి అని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ వెల్లడించారు. సుక్మా, దంతేవాడ జిల్లా సరిహద్దులోని ఉప్పంపల్లి కేర్లపాల్ అటవీ ప్రాంతం ఏరియాలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు. బస్తర్ ఐజి పి సుందర్ రాజ్ ఏఎన్ఐ తో మాట్లాడుతూ 16 మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన చోట పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్‌లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా దళాలు వెళ్లాయి. యాంటీ మావోయిస్టు ఆపరేషన్ సమయంలో భాగంగా మార్చి 25న భద్రతా బలగాలకు మాయివోస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.