Just In





Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Ration Cards In Telangana | రేషన్ కార్డులు లేకున్నా, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే వారికి సైతం సన్న బియ్యం అందిస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Telangana Ration Cards News | ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని ఇదివరకే చెప్పింది. అయితే రేషన్ కార్డు (Ration Card) లేకున్నా లబ్ధిదారుల జాబితాలో కనుక పేరు ఉంటే వారికి సైతం సన్నబియ్యం అందిస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam TKumar Reddy) తెలిపారు.
జాబితాలో పేరు ఉంటే చాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ నాడు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుడతారని ఉత్తమ్ తెలిపారు. ఉగాది రోజున పేద, మధ్యతరగతి వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది పలుకుతుందన్నారు. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి, రేషన్ కార్డు జాబితాలో పేరు ఉన్న సరే వారికి సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో 85% జనాభాకు సన్న బియ్యం ఇస్తామన్నారు. అయితే వారు రేషన్ బియ్యాన్ని ఇంట్లో వినియోగించడం లేదని, దొడ్డు బియ్యాన్ని కొందరు బ్లాక్లో అమ్ముతున్నారని ప్రభుత్వం గుర్తించింది. దాంతో సన్న బియ్యం పంపిణీ చేసి వారికి ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే మరిన్ని సరుకులు
సన్న బియ్యంతో పాటు త్వరలోనే పప్పులు, నూనెలు లాంటి సరుకులను రేషన్ దుకాణాలలో అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి రేషన్ బియ్యంపై ప్రతి ఏడాది 10,665 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు జారీ
తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. పలు దఫాలుగా రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం. వాటిని పరిశీలించాక, అర్హుల జాబితా రూపొందించి కార్డుల జారీ మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరి 26న పైలట్ ప్రాజెక్టుగా కొంత మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు.
గతంలో దరఖాస్తు చేసినవారు, ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసిన వారు సైతం గ్రామ సభలలో మరోసారి దరఖాస్తు చేయడంతో ఒకటే దరఖాస్తులను పదే పదే పరిశీలించడంతో కొత్త కార్డుల జారీలో జాప్యం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియలో జాప్యం జరిగిందని మంత్రులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో అయినా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా కార్యరూపం దాల్చలేదు.