31 Naxals killed in Bijapur encounter | బీజాపూర్: తుపాకుల కాల్పుల మోతతో ఛత్తీస్‌గఢ్ మరోసారి దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 31 మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు ముందు బస్తర్ పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు. ఆదివారం ఉదయం నుంచి డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని బస్తర్ పోలీసులు తెలిపారు.
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. ఎకే 47, ఇన్సాస్, బిజిఎల్, ఎస్.ఎల్.ఆర్ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఉండే అవకాశం ఉందన్నారు.
మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్
బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌పై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందించారు. ‘మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజం, మావోయిస్టులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎంతో ధైర్య సాహసాలు చేసి ఆపరేషన్లలో పాల్గొంటున్న జవాన్లు, భద్రతా బలగాలు, పోలీసులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో మావోయిస్టులు, నక్సలైట్ల ఏరివేతకు చర్యలు చేపట్టింది.
వచ్చే ఏడాది మార్చి (2026) వరకు దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతాం. భద్రతా సిబ్బంది, బలగాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. త్వరలోనే మావోయిస్టులు మొత్తాన్ని ఏరివేస్తాం. వారు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని’ మావోయిస్టులకు సైతం సూచించారు.
ఛత్తీస్ గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోతున్నారు. అయినా వారు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు టాప్ లీడర్లు ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. ఇటు కేంద్రం మాత్రం ఆపరేషన్ కగార్ కంటిన్యూ అవుతుందని.. దేశంలో మావోయిస్టులు, నక్సలైట్లు లేకుండా చేయడమే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు సందర్భాలలో ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ తమ లక్ష్యమన్నారు.