Honour Killing in Chennai: చెన్నైలో పరువు హత్య కలకలం రేపింది. 26 ఏళ్ల యువకుడిని కొందరు దారుణంగా నరికి చంపారు. ఓ యువతిని కులాంతర వివాహం చేసుకున్నందుకు ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి పేరు ప్రవీణ్‌గా గుర్తించారు. మెకానిక్‌గా పని చేస్తున్నట్టు వెల్లడించారు. పల్లికరనై ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం షర్మిల అనే యువతిని ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి యువకుడిపై పగ పెంచుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు ప్రవీణ్ బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే యువతి సోదరుడితో పాటు మరో నలుగురు దుండగులు వచ్చి ప్రవీణ్‌ని చుట్టుముట్టారు. ఆ తరవాత కత్తులతో దాడి చేశారు. ఆ ధాటికి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ఈ హత్యపై బాధితుడి తండ్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎప్పటిలాగే బయటకు వెళ్లిన తన కొడుకు రెండు గంటలు గడిచినా రానప్పుడే అనుమానం వచ్చిందని చెప్పాడు. 


"ఎప్పటిలాగే ఫుడ్ తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. రెండు గంటలు దాటినా ఇంకా ఇంటికి రాలేదు. అప్పటికే మేం బాగా టెన్షన్ పడుతున్నాం. మా కోడలు గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టగానే నాకు అనుమానం వచ్చింది. ఏదో జరిగిందని అర్థమైంది. నా కొడుకుని చంపిన వాళ్లందరికీ కఠిన శిక్ష పడాలి. మా కోడలి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను"


- మృతుడి తండ్రి