CBI Polygraph Test To Accused In Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనకు (Kolkata Incident) సంబంధించి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు సీబీఐ అధికారులు ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ (Polygraph Test) నిర్వహించారు. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉండగా అక్కడే ఈ లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. అయితే, ఈ పరీక్షలో నిందితుడు ఏం చెప్పాడనేది.? అధికారులు గోప్యంగా ఉంచారు. టెస్ట్‌లో సంజయ్ రాయ్ పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తాను సెమినార్ హాల్‌కు వెళ్లే సరికే వైద్యురాలు చనిపోయిందని.. ఆమె మృతదేహాన్ని చూసి భయంతో పారిపోయినట్లు అతను తెలిపినట్లు సమాచారం. దీంతో సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్‌లకు చెందిన అధికారులు పలు ఆధారాలు చూపించి ప్రశ్నించగా.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్లు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రోజు రెండు రెడ్ లైట్ ఏరియాల్లో తిరిగానని.. అయితే శృంగారంలో పాల్గొనలేదని పేర్కొన్నట్లు సమాచారం. ఓ వీధిలో మహిళను వేధించినట్లు పాలీ గ్రాఫ్ టెస్టులో ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనే సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.


'అవాస్తవాలు, సరిపోలని ఆన్సర్స్'


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ఈ నెల 9న వైద్యురాలిపై దారుణం జరిగింది. నిందితుడు ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడు అనంతరం హత్య చేశాడు. వైద్యురాలి మృతదేహాన్ని సెమినార్ రూమ్‌లో గుర్తించిన ఓ డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైద్యులు తీవ్ర ఆందోళనలు చేశారు. కాగా, ఘటన జరిగిన మరుసటి రోజు సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా.. కోర్టు ఆదేశాలతో తాజాగా నిందితునికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కాగా, ఈ పరీక్ష సమయంలో నిందితుడు సంజయ్ ఆత్రుతగా, అనాలోచితంగా ఉన్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అవాస్తవాలు, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. అటు, నిందితునికి టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరఫున డిఫెన్స్ లాయర్ లేకపోవడం చర్చనీయాంశమైంది. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారనేది తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. ఇది మానవ హక్కుల కిందకే వస్తుందని ఆ న్యాయవాది అన్నారు. 


అయితే, తొలుత నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడింది తానేనంటూ కోల్‌కతా పోలీసుల ముందు నేరం అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా తనకేమీ తెలియదని, అమాయకుడినని న్యాయమూర్తి ముందు ఏడ్చాడు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని సంచలన ఆరోపణలు చేశాడు. అటు, నిందితుని తల్లి సైతం తన కుమారున్ని ఎవరో ఇరికించారని ఆరోపించారు. 


Also Read: Assam Girl: 'ఆంటీ అత్యాచారం అంటే ఏంటి?' - ఇలా అడిగిన రెండు రోజులకే ఆ బాలికపై దారుణం, మనసులను కలిచి వేసే కన్నీటి కథ